నిర్మల్ హత్య కేసు: నిందితుడి అరెస్టు
సాక్షి, నిర్మల్: మండలంలోని చిట్యాల్ గ్రామానికి చెందిన సాయన్న హత్య కేసు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిచింనట్లు డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. చిట్యాల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ భార్యతో మృతుడు సాయన్నకు విహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పలుమార్లు పంచాయతీ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో శ్రీనివాస్ తరచూ అనారోగ్యం బారిన పడటంతో సాయన్న తనకు మంత్రాలు చేస్తున్నాడని అనమానం పెంచుకున్నట్లు తెలిపారు. దీంతో సాయన్నను అంతమొందించాలని శ్రీనివాస్ పథకం పన్నాడని ఈ నేపథ్యంలో ఈనెల 16న గురువారం రాత్రి సాయన్నను హత్య చేసేందుకు ఇంటి బయట శ్రీనివాస్ కాపు కాచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఆ రోజు రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సాయన్నపై నిందితులడు శ్రీనివాస్ పదునైన కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. హత్య అనంతరం శవాన్ని ఇంటి సమీపంలో ఖననం చేసేందుకు గోతి తవ్వాడని, అది వీలు కాకపోవడంతో మృతదేహాన్ని అక్కడే ఉంచి శ్రీనివాస్ తన ఇంట్టికి వెళ్లి రక్తపు మరకలతో ఉన్న షర్ట్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారైనట్లు ఆయన తెలిపారు. మరుసటి రోజు(శుక్రవారం) ఉదయం ఇంటి బయట సాయన్న మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారన్నారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితుడు శ్రీనివాస్‌ను శనివారం దిలావర్ పూర్ గ్రామ సమీపంలో అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై కృష్ణ కుమార్ కూడా పాల్గొన్నారు.