‘మాడా’.. గుండె దడ!
సాక్షి, ముంబై: నగరంలో మహారాష్ర్ట హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మించిన ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వాటిపై ఆశలు పెట్టుకున్న నిరుపేదలు, పేదలు, మధ్యత రగతి ప్రజలు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో మాడా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు ప్రకటన వెలువడగానే విక్రయించడం ప్రారంభిస్తారు. వాటిని మరుసటి రోజు నుంచి అన్ని యాక్సిస్ బ్యాంకుల్లో స్వీకరిస్తారని మాడా ప్రధాన అధికారి నిరంజన్‌కుమార్ సుధాంశు చెప్పారు. నగరంలో ఉంటున్న ప్రతి పేదవాడికి సొంతగూడు ఉండాలనే ఉద్దేశంతో గత దశాబ్దం నుంచి శివారు ప్రాంతాల్లో మాడా వేలాది ఇళ్లు నిర్మిస్తోంది.
ఆదాయాన్ని బట్టి అల్ప, అత్యల్ప, ఉన్నత వర్గాలుగా విభజించి వాటిని మాడా నియమ, నిబంధనలకు లోబడి ఉన్న అర్హులకు లాటరీ ద్వారా చౌక ధరలకే విక్రయిస్తోంది. ఇళ్లు చౌక ధరలకే లభించడంతో గతంలో నాలుగు వేల ఇళ్లకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా, మొదట్లో మాడా ఇళ్ల ధరలు పేదలకు సైతం అందుబాటులో ఉండడం వల్ల స్పందన విపరీతంగా ఉండేది. కాని ప్రస్తుతం నిర్మించిన 878 ఇళ్ల ధరలను మాడా ఒక్కసారిగా మూడు రెట్లు పెంచేయడంతో చాలామంది దరఖాస్తు చేయడానికే జంకుతున్నారు. కొంకణ్ రీజియన్‌తోపాటు ముంబై రీజియన్‌లో మాడా నిర్మించిన ఇళ్లకు లాటరీ వేయాలని నిర్ణయించారు. సదరు ఇళ్ల ధరలు నిశ్చయించేందుకు ఇటీవల మాడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అందులో ప్రాంతం, చదరపుటడుగులను బట్టి ధరలు నిర్ణయించారు.
ఆ ప్రకారం దహిసర్‌లోని శైలేంద్రనగర్లో నిర్మించిన 871 చదరపుటడుగుల ఇల్లుకు ఏకంగా రూ.95 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. అంతేగాకుండా దరఖాస్తుతోపాటు డిపాజిట్ రూపంలో మాడాకు చెల్లించాల్సిన డబ్బులను ఏకంగా రెండు రెట్లు పెంచింది. అత్యల్ప వర్గాల ఇళ్లకు రూ.16 వేలు, అల్పవర్గాల వారు రూ.16వేల నుంచి రూ.40 వేలు, మధ్యతరగతి ఇళ్లకు రూ. 40 వేల నుంచి రూ.70 వేలు, ఉన్నత వర్గాలకు రూ.70వేలకు పైగా డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే కచ్చితంగా ఎంత మేర డీడీ తీయాలనేది ప్రకటనతోపాటు వెల్లడిస్తామని నిరంజన్‌కుమార్ చెప్పారు.