చేనేతల క్లస్టర్‌కు గ్రహణం వీడదా!
సిద్దవటం: రు.సమీకత సామూహిక అభివద్ధి పథకం (చేనేత క్లస్టర్) 5 సవంత్సరాల క్రితం మూత పడింది. నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యధోరణి ఇతర కారణాలు పథకం అమలుకు శాపంగా మారాయి. దీంతో క్లస్టర్ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ పథకం అమలు చేస్తే తమ కష్టాలు తీరతాయని చేనేత కార్మికులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. నూతన కార్య వర్గం అయినా చొరవ తీసుకొని క్లస్టర్ భవనంను తెరిపిస్తే తమ జీవితాల్లో వెలుగు నిండుతాయని చేనేత కార్మికులు ఆశ పడుతున్నారు. అయితే నూతన కార్యవర్గం ఏర్పడి ఏడాదికి పైగా కావస్తున్నా క్లస్టర్ భవనం తెరుచుకోలేదు. చేనేత క్లస్టర్‌ను 23 మార్చి 2010లో ప్రారంభించారు. చాలా కాలం కిందట ఏర్పాటైన క్లస్టర్ పాలక వర్గం కమిటీ పదవీ కాలం 4సంవత్సరాల క్రితం ముగిసింది.
రూ. కోట్లు ఖర్చు ఎవరికి ప్రయోజనం:
సిద్దవటం మండలం లోని మాధవరం–1 గ్రామంలోనిర్మించిన చేనేత క్లస్టర్ భవనం ఉప్పరపల్లె, మాధవరం1,2,3,వార్డులు, మాధవరం–1 పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు వరంగా నిలుస్తుందనుకున్న చేనేత క్లస్టర్ భవనం ప్రారంభమైన కొన్నాల్లకే మూత పడింది. ఇక్కడి క్లస్టర్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ.2కోట్లు మంజూరు చేయించారు. రూ. 1.70 కోట్లు ఖర్చు చేసి రెండు భారీ భవనాలను నిర్మించారు. ఒకటి మౌళిక వసతి కల్పనకు, మరొకటి అధునాతన యంత్రాలు, పరికరాల కోసం డైయింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో షోరూమ్, అధికారి గది, సమావేశపు హాలు, మగ్గాలు, ఆస్మాలు, వైండింగ్, నాణ్యత సూచించే ల్యాబ్, రంగుల అద్దకం, తదితర యంత్రాలు, పరికరాల సదుపాయాలు కల్పించారు. అవి ప్రస్తుతం తుప్పుపట్టి ఉపయోగానికి పనికి రాకుండా పోయాయి. చేనేత క్లస్టర్ భవనాలకు రక్షణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. భవనాల కిటికీల అద్దాలను కొందరు ఆకతాయిలు పగులగొట్టారు. అధునాతన యంత్రాలు, పరికరాలతో ఏర్పడిన ఈ క్లస్టర్లో కొత్త డిజైన్లతో వస్త్రాలు నేయవచ్చునని, నూలు, జరీ,పట్టు, తక్కువ ధరలకే లభిస్తాయని, నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం, తమకు అవసరమయ్యే సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తాయని ఆశపడ్డారు. కార్మికులకు ఉపయోగపడకుండా మాత పడటంతో తమ కష్టాలు తీరేదెలా! అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.