నిర్విన్కు దెయ్యం పట్టిందా?
- ఏదో శక్తులున్నాయని ప్రజల మూఢవిశ్వాసం
- కొన్నాళ్లుగా వ్యాధుల బారిన పడుతున్న జనం
కొత్తకోట: హైటెక్ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. తమను ఏదో శక్తులు ప్రభావితం చేస్తున్నాయని మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ గ్రామస్తులు భయపడుతున్నారు. ఒక రోజు గ్రామం విడిచి వెళితే ఊరికి పట్టుకున్న శక్తులు తొలగిపోతాయని భావించి, ఆదివారం వనంబాట పట్టారు. వివరాల్లోకి వెళితే.. నిర్విన్లో కొన్నాళ్లుగా ప్రజలు తరుచు వ్యాధుల బారిన పడటంతో గ్రామానికి ఏదో అయిందన్న భావన గ్రామస్తుల్లో నెలకొంది.
దీంతో ఒకరోజు గ్రామాన్ని వదిలి వెళ్లాలని కొందరు పెద్దలు నిర్ణయించారు. గ్రామంలో ఎవరు సంచరించకుండా ఉంటే ఊరికి పట్టుకున్న శక్తి తొలగిపోతుందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గ్రామస్తులందరూ ప్రధాన వీధిలో ఒకచోట పూజలు చేశారు. గ్రామంలో ఒక్కరూ ఉండకుండా అందరూ ఊరు విడిచి వనాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు వనాల్లోనే గడిపారు. చిన్న పిల్లలు చెట్ల కింద ఆటలాడుకున్నారు. మహిళలు బొడ్డెమ్మలు వేశారు. గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా నాలుగు పొలిమేరల్లో రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేశారు. గ్రామసేవకులు పొలిమేరల్లో కాపలా కాశారు. ఈ సంప్రదాయంతో తమ గ్రామానికి పట్టుకున్న శక్తి వదులుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.