‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్లు
ఎన్నికల మేనిఫెస్టోలో జేడీయూ హామీ
పాట్నా: బీహార్ సహా అభివృద్ధి రేటు తక్కువ ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకూ రిజర్వేషన్లు.. వలస కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలు.. ఇవీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనతాదళ్ (యూ) శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోలోని కీలక హామీలు. శనివారం పాట్నాలో జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీహార్‌లో తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధిని శరద్‌యాదవ్ కొనియాడారు.
రామ్‌మనోహర్‌లోహియా కన్న కలలు నిజమయ్యాయని, ఇదే అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీహార్‌లో విజయవంతమైన పంచాయతీల్లో.. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దేశం మొత్తం మీద అమలు చేస్తామన్నారు. ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నితీష్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్వచిస్తామని, రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన పథకాలను రద్దు చేస్తామన్నారు.