'వరంగల్ ఎన్ఐటీలో ప్రవేశాలు కల్పించబోమనడం దారుణం'
విశాఖపట్నం : వరంగల్ ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశం కల్పించబోమని తెలంగాణా విద్యాశాఖ మంత్రి ప్రకటించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రి దారుణంగా మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించకపోవడం శోచనీయమన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో చదువుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయిడు, విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ వర్సిటీని విస్మరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్, స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కాంతారావు, జోగారావు, కోటి గణపతి పాల్గొన్నారు.