Nitya Kalyanam
-
సీతారామచంద్ర స్వామికి కాసుల పంట
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచియాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్ తెలిపారు. చదవండి: పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి -
శ్రీ సత్యదేవుని కల్యాణం చూతము రారండీ...
నిత్యం కల్యాణాలతో.. పచ్చని పెళ్లి పందిళ్లతో.. పసుపు బట్టలతో తిరుగాడే నవ దంపతులతో కళకళలాడే రత్నగిరిక్షేత్రం అది.. దేశంలో ఎక్కడా జరగని విధంగా నిత్యం వేల సంఖ్యలో వ్రతాలు జరిగే మండపమది..... కొత్తగా పెళ్లైన జంటలు పసుపుబట్టలతోనే నేరుగా అక్కడకు చేరుకుని వ్రతమాచరించే పుణ్య వేదిక. భక్తితో వచ్చిన ప్రతివ్యక్తికి కడుపునిండుగా భుక్తిదొరికేలా నిత్యాన్నదానానికి పేరుగాంచిన సత్రమది... భక్తజనకోటి బారులుతీరి మైమరచి పరవశించే ప్రాంతంగా విరాజిల్లుతోన్న అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం గురించి తెలియని వారుండరు. అటువంటి సత్యదేవునికి నిత్యకల్యాణంతో పాటు వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు కూడా ప్రసిద్ధి చెందినవే. వ్రతానికి ఉన్న విశిష్టతే కల్యాణోత్సవాలకు కూడా ఉంది. ఏడాదికొకసారి నిర్వహించే సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభమై మే 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 29 రాత్రి 9-30 గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. స్వామివారు రత్నగిరిపై ఆవిర్భవించినప్పటి నుంచి అంటే గత 124 సంవత్సరాలుగా ఏటా ఈ వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రతినిత్యం దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారితో కల్యాణం జరుగుతుంది. భక్తులు చూసి తరించేందుకు, వారే కల్యాణకర్తలుగా ఉండి స్వామి కల్యాణం జరిపే అవకాశం దశాబ్దాలుగా భక్తులకు కలుగుతోంది. నిత్య కల్యాణం పచ్చతోరణం శ్రీసత్యదేవుడు, దేవేరి శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు కొలువైన రత్నగిరిపై స్వామి అమ్మవార్లకు ప్రతీరోజూ కల్యాణం జరగడం ఈ క్షేత్ర విశేషం. నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఈ క్షేత్రంలో ప్రతీరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11-30 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం గత 60 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. స్వామి, అమ్మవార్లకు ప్రతీఏటా వైశాఖమాసంలో శుద్ద ఏకాదశి పర్వదినం నాడు దివ్య కల్యాణాన్ని పండితులు ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు కల్యాణ వేడుకలు జరుగుతాయి. ఈ కల్యాణం తిలకించలేక తీవ్ర నిరాశకు గురయ్యే భక్తుల కోసం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని ప్రతినిత్యం దేవస్థానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. వైశాఖమాసంలో వార్షిక కల్యాణం శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వారు వైశాఖ శుద్ద దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ (ఈ నెల 28 నుంచి మే5 వరకు) స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు నిర్విహ స్తున్నారు. వైశాఖ శుద్ద ఏకాదశి నాడు నిర్వహించే ఈ కల్యాణ వేడుకలను రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులు తిలకించి ముక్తి పొందుతుంటారు. అనంతరం భక్తులకు సత్యదేవుని తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఈ వార్షిక కల్యాణోత్సవాలు జరిగే వారం రోజులు స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించరు. శ్రీసత్యదేవుని కల్యాణానికి పెళ్లి పెద్దలుగా రత్నగిరి క్షేత్రానికి పాలకులైన శ్రీసీతారాములు వ్యవహరిస్తే, శ్రీరామనవమి నాడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం విశేషం. - లక్షింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, రాజమండ్రి