మరణశయ్యపై తల్లీ బిడ్డలు
మాతా శిశు మరణాల్లో అగ్రస్థానంలో కర్ణాటక
{V>Ò$× ప్రజల్లో అవగాహన లేమి, వసతుల కొరతే కారణమంటున్న వైద్యులు
బెంగళూరు : సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోని మి గిలిన రాష్ట్రాలతో పోలి స్తే అందనంత ఎత్తులో ఉన్న కర్ణాటక, మాతా శిశు సంరక్షణలో మా త్రం అథఃపాతాళంలో ఉంది. నిపుణులైన మానవ వనరులు లేకపోవడంతోపా టు అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుకు ప్రముఖ కారణమని తెలుస్తోంది. దీంతో కళ్లు తెరవక ముందే పసిమొగ్గలు రాలిపోతున్నాయి. అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవలసిన పసికందులు, రోజులు గడవక ముందే తనువు చాలిస్తున్నారు. మరోవైపు మాతృత్వపు మ మకారాన్ని చవిచూడకుండానే ప్రసవిం చిన గంటల్లోపే తల్లులు మృత్యువాత పడుతున్నారు.
దక్షిణాదిలో మొదటి స్థానంలో కర్ణాటక
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మాతా శిశు మరణాలు కర్ణాటకలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బెళగావి, కలబుర్గీ, యాదగిరి, కొప్పాల్, రాయచూర్, బళ్లారీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ హై-క ప్రాంతంలో చిన్నవయసులోనే పెళ్లిళ్లు కావడం వల్ల చాలా మంది 18 ఏళ్లలోపే గర్భం దాలుస్తున్నారు. దీంతో ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురై మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నిపుణులైన వైద్యులు అవసరమైన సంఖ్యలో అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రిలోని నియోనేటనల్ ఇన్సెటివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో అవసరమైన పరికరాలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నుంచి చివరి సమయంలోనే (క్రిటికల్ టైం) గర్భిణులు ఆస్పత్రులకు వస్తున్నారని దీంతో తల్లి, లేదా బిడ్డల్లో ఎవరో ఒకరిని మాత్రమే బతికించడానికి వీలవుతోందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మాతా, నవజాత శిశుమరణాల పరిస్థితిని వివరిస్తూ రాజమల్లప్ప అనే సామాజిక వేత్త రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్‌తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ‘‘ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కిమ్స్‌లో రోజుకు సగటున 30 ప్రసవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మూడు రోజులకు రెండు మాత, నవజాత శిశుమరణాలు సంభవిస్తున్నాయి.’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగా మాతా, శిశు మరణాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని ఆయన వాపోతున్నారు.