ఆశీర్వదించాల్సిన చేతులు యాచిస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను ఆశీర్వదించాల్సిన బ్రాహ్మణుల చేతులు యాచించే స్థాయికి చేరాయని, అధికారం ఉంటేనే ఆశీర్వదించే అవకాశం ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, నమస్తే తెలంగాణా దినపత్రిక అధిపతి సి.లక్ష్మీరాజం అన్నారు. బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల మైదానంలో బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ఆయన స్వాగతోసన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2న నిర్వహించే అర్చక శంఖారావం కరపత్రాన్ని ఆయన మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీరాజం మాట్లాడుతూ రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా బ్రాహ్మణుల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు.
మూడు అసెంబ్లీ, ఒక రాజ్యసభ స్థానాన్ని బ్రాహ్మణులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన ట్లే అన్నిపార్టీలు కూడా బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యం కల్పించని పార్టీలకు బ్రాహ్మణులు సంఘటితంగా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల అనైక్యత వల్లనే ప్రభుత్వం దివంగత పీవీ నరసింహారావును భారతరత్న పురస్కారంతో గౌరవించలేదన్నారు. ఆత్మగౌరవసభ విజయవంతం కాలేదని నిరాశ చెందవద్దని, కొద్ది నెలల్లోనే మరోమారు ఇదే మైదానంలో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... రాబోయే ప్రభుత్వంలో అర్చకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. గౌరవ అతిధిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... బ్రాహ్మణులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరముందని చెప్పారు.
బాహ్మణుల సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు 2014 ఎన్నికలను వేదికగా చేసుకోవాలని టీటీడీ పూర్వ కార్యనిర్వహణాధికారి కె.వి.రమణాచారి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ డీజీపీ అరవిందరావు సూచించారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా సాగాలని వైఎస్సార్సీపీ నేత జనక్‌ప్రసాద్ సూచించారు. తన తండ్రి పీవీ నరసింహారావు క్లిష్టపరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపినా కాంగ్రెస్ పార్టీ ఆయనను అగౌరవపరుస్తోందని మాజీ ఎంపీ పీవీ రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సి.విజయ లక్ష్మీరాజం, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, సుదీష్ రాంభొట్ల, సుమలత శర్మ, వెల్లాల రామ్మోహన్, సుధాకర్ శర్మలతోపాటు వివిధ పార్టీల నుంచి నగరంలోని అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.