ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు కన్నుమూత
నల్లగొండ కల్చరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత ఎన్.కె.రామారావు (78) గురువారం మృతిచెందారు. ఇటీవల సూర్యాపేటలో బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వి షయం తెలిసిందే. ఈయన తెలుగు,ఆంగ్ల, హిం దీ సాహిత్యంలో ప్రావిణ్యుడు. ప్రముఖ సినీ నిర్మాత దర్శకులు బాపు, రచయిత రమణ, సాహితీ దిగ్గజాలైన శ్రీశ్రీరమణ,రావిశాస్త్రి, సినీగాయకులు బాలసుబ్రమణ్యం, కాంతారావులతో సంబంధాలు కొనసాగించారు.
బొంబాయికి ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినీప్రముఖులు రాజ్‌కపూర్, షమ్మీకపూర్ల ఇంటర్వ్యూలతో వ్యాసాలు ప్రచురించారు. జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రామారావుకు న్యాయశాస్త్రంపై పట్టున్న వ్యక్తిగా ప్రఖ్యాతి సంపాదించారు. ఇక సాహిత్యసేవా కార్యక్రమాలలో, జిల్లా సాహితీ ప్ర ముఖులు కాంచనపల్లి చిన వెంకటరామారావు 1967 స్థాపించిన యువ రచయితల సమితిలో సభ్యులుగా ఉండి తన కథా రచనలకు శ్రీకారం చుట్టారు. 1983లో జిల్లా రచయితల సంఘం మహాసభలకు శ్రీశ్రీని తీసుకుని వచ్చిన ఘనత వీరిదే. 1972లో బాపువేసిన ముఖ చిత్రంతో ‘‘విద్యుల్లత’’ కథల సంపుటిని ప్రచురించారు. బాపు ముఖచిత్రంతో మరోకథల సంపుటి ‘‘మా మిలట్రీ బాబాయి’’ త్వరలో రాబోతుంది కూడా. ప్రస్తుతం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడిగా యువ రచయితల సంఘానికి డెరైక్టర్‌గా ఉన్నారు.
పలువురి సంతాపం
జిల్లాలోని సాహితీ ప్రియులు, కళాకారులు ఎన్.కె.రామారావు మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశా రు. డాక్టర్లు నోముల సత్యనారాయణ, బెల్లి యాదయ్య, బోయ జంగయ్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, ఎంఎల్. నర్సింహారావు, డాక్టర్ పురుషోత్తమాచారి, డాక్టర్ లేఖానందస్వామి, కొండకింది చిన వెంకట్‌రెడ్డి, పున్న అంజయ్య, ఫొటోగ్రాఫర్ శ్యాం సుందర్, చకిలం వేణుగోపాలరావు, సంధ్యారాణి తదితరులు సంతాపం తెలిపారు.