కరుణానిధిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
సొంత పార్టీ డీఎంకేపై విమర్శలు గుప్పించి బహిష్కరణకు గురై 24 గంటలు గడవక ముందే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తొలిసారిగా శనివారం ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అళగిరి మాట్లాడారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం ఎక్కడేడ్చిందనిదంటూ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే డిమాండ్ చేశానని, అంతేకాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. తన తండ్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అళగిరి ఈ సందర్భంగా ఆరోపించారు.
సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగిన అళగిరిపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి, చిన్న కుమారుడు స్టాలిన్ల నడుమ పార్టీలో అధిపత్య కోసం చేసే పోరు పతాక స్థాయికి చేరింది. తమిళ హీరో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. కాగా అదే స్థాయిలో బీజేపీ కూడా విజయ్ కాంత్ పార్టీతో పొత్తుకు సై అంటుంది. అయితే డీఎండీకేతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించిన డీఎంకే అధినేత కరుణానిధి, ఇప్పటికే ఆ పార్టీతో మంతనాలు పూర్తి చేశారు.
కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు, మదురై ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విజయకాంత్‌ను రాజకీయ నేతగా పరిగణించబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో విజయ్‌కాంత్‌పై ఈ వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని కరుణ ఈనెల 7న తీవ్రంగా మందలించారు. పొత్తులపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని తన నివాసంలో కలసిన అళగిరిని కరుణానిధి ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఆ భేటీ అయిన కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కరుణానిధి ప్రకటించారు. ఆ ప్రకటనపై స్టాలిన్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. అళగిరి వర్గం మాత్రం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందంటూ ఆగ్రహం వెళ్లకక్కింది.