No Kings protests
-
అమెరికాలో ‘నోకింగ్స్’ ఉద్యమం.. బెంబేలెత్తిస్తున్న ‘సికాడా’ వేరియంట్?!
వాషింగ్టన్: అమెరికాలో ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ‘నో కింగ్స్’ నినాదంతో సుమారు 8 మిలియన్ల మంది పాల్గొన్న ఈ నిరసన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇదే సమయంలో, అమెరికాలో కొత్తగా గుర్తించిన కోవిడ్-19 వేరియంట్ ‘సికాడా’ (BA.3.2) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందిన బీఏ.3 వేరియంట్ నుంచి పుట్టినదిగా వైద్యులు నిర్ధారించారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ప్రజలు ఆందోళన చేస్తుండగా.. జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్-19 వేరియంట్ వ్యాప్తి విజృంభిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024లో దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ అప్పట్లో పెద్దగా వ్యాప్తి చెందలేదు. కానీ 2025లో మోజాంబిక్, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మిచిగన్, న్యూయార్క్, మిస్సోరీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో ఇది వెలుగులోకి వచ్చింది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నివేదికల ప్రకారం, వేస్ట్‌వాటర్ సర్వైలెన్స్, క్లినికల్ నమూనాలు, ప్రయాణికుల పరీక్షల ద్వారా ఈ వేరియంట్ గుర్తించబడింది. అమెరికాలో మొత్తం 25 రాష్ట్రాల్లో ఇది ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాల్లో ఇది కనిపించింది.‘సికాడా’ వేరియంట్ లక్షణాలు సాధారణ కోవిడ్ లక్షణాలతో పోలి ఉంటాయి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఇది వాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ‘నో కింగ్స్’ ఆందోళనతో పాటు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. -
ట్రంప్ దిగిపో.. USAలో 80 లక్షల మంది రోడ్లపైకి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పేరు వింటే చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచాన్నే సంక్షోభంలో నెట్టిపడేసారని ప్రజలంతా ఆయనపై కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రికార్డు స్థాయిలో 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు అక్కడి పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్ నిర్ణయాల పట్ల అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్దానికి నిరసన తెలపడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా 3,300 చోట్ల ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అమెరికా వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' అనే పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మీడియా కథనాల ప్రకారం ఈ ప్రదర్శనలు అమెరికా అంతటా 50 రాష్ట్రాల్లో 3,300 కి పైగా ప్రదేశాలలో జరుగగా రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. కాగా ఇదివరకే ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో జరిపిన నిరసన కంటే ఈ సారి దాదాపు 10 లక్షల మంది అధికంగా పాల్గొన్నారని 600కు పైగా అధికంగా ఈవెంట్లు నిర్వహించబడ్డాయని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా మెుదటిసారి జూన్ 2025లో తరువాత అక్టోబర్ 2025 లో రెండవ నిరసన జరిగింది. ట్రంప్, వాన్స్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఫ్లకార్డులు ప్రదర్శన చేపట్టినట్లు నిరసనలు జరిపారని కథనాలు పేర్కొన్నాయి. -
అమెరికాలో మళ్లీ 'నో కింగ్స్'.. ట్రంప్‌నకు నిరసన సెగ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ‘నో కింగ్స్ (No Kings) నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. మిన్నెసోటాలోని కాలిపాట్ లాన్‌కు భారీగా నిరసన కారులు వీధులోకి వచ్చారు.అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, పారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3,200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో జరిగిన రెండు 'నో కింగ్స్' ఈవెంట్లకు లక్షలాది మంది హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే నిరసనగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టీన్, జోన్ బేజ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇక్కడ సుమారు లక్ష మంది మంది పాల్గొంటారని అంచనా. మిడ్‌టౌన్ మాన్హాటన్లో వేలాది మంది వీధులోకి చేరుకున్నారు. నటుడు రాబర్ట్ డి నీరో మాట్లాడుతూ.. గతంలో చాలామంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు, కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదంటూ వ్యాఖ్యానించారు.వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. మేరీల్యాండ్‌లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనలు.. ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయంటూ వైట్ హౌస్ కొట్టిపారేసింది. -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్‌ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్‌మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఈ ఏడాది జూన్‌లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్‌కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి!


