మీడియాకు కేజ్రీవాల్ దూరం! ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెలలో 12 రోజులపాటు మీడియాకు దూరంగా ఉండబోతున్నారట!. న్యూస్ పేపర్లు, టీవీ లాంటి వాటి జోలికి అసలు వెళ్లరని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఒకరు తెలిపారు. ఇంతకు ఈ 12 రోజుల పాటు కేజ్రీవాల్ ఏం చేస్తారు? ఇదేగా మీ డౌటు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో వరుసగా వివాదాల తర్వాత కేజ్రీవాల్ కొంత బ్రేక్ కోరుకుంటున్నారు.
2014 లోక్ సభ ఎన్నికల తర్వాత 'విపాసన' ధ్యానం కోసం బ్రేక్ తీసుకున్న కేజ్రీవాల్.. వచ్చే నెలలో విపాసన కోసం 12 రోజులపాటు లాంగ్ లీవ్ ను తీసుకోనున్నారు. చాలాకాలంగా ఆయన విపాసన ధ్యాన సాధన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న నాగ్ పూర్ లోని మెడిటేషన్ సెంటర్ లో ఇందుకు పేరు నమోదు చేసుకోనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ లీవ్ లో ఉండే ఈ కాలంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. విపరీతమైన దగ్గు కారణంగా ఈ ఏడాది జనవరిలో కేజ్రీవాల్ 10 రోజులపాటు మెడికల్ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే.