ఏపీ ఎంసెట్లో అక్రమాల్లేవు: కామినేని
ఏపీలో నిర్వహించిన ఎంసెట్ మెడికల్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. 15 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులు చేరితే ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆప్షన్ల ఎంట్రీని వాయిదా వేసినట్లు తెలిపారు. వచ్చే నెల 6, 7 తేదీలలో ఆప్షన్ల ఎంట్రీకి అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఎంసెట్ ఆలస్యమైతే... ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఇక ఏపీలో పీజీ మెడికల్ సీట్లు తీసుకున్నవాళ్లు కచ్చితంగా చేరాలని కామినేని శ్రీనివాస్ తెలిపారు. వాళ్లు సీట్లు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సీట్లు రద్దు చేసుకుంటే రూ. 2 లక్షలు కట్టాలని, అలా కట్టనివాళ్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని తెలిపారు. కొంతమంది కౌన్సెలింగ్లో సీట్లు తీసుకుని, కోర్సులలో చేరకపోవడంతో చాలా సీట్లు మిగిలిపోయి ఎంతోమందికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.