no smoking day
-
మీకు ధూమపానం అలవాటుంటే ఇలా చేయండి...
పొగ.. పగ సాధిస్తోంది. సరదా.. సరదా సిగరెట్టు..అనారోగ్యానికి తొలిమెట్టులా మారిపోయింది.ఎంతటి ఒత్తిడి నుంచైనా సిగరెట్, బీడీ, చుట్టలు ఉపశమనంకలిగిస్తాయని, అవి లేనిదే జీవితం లేదని గొప్పలు చెప్పే పొగరాయుళ్లు.. వైద్యులు చెప్పే విషయాలు చదివితే గుండెజారడం ఖాయం.ధూమపానం వలన గుండెతో పాటు జేబుకూ చిల్లు తప్పదు.ఆ విషయం తెలుసుకునేలోపే సిగరెట్ పొగలాగే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయనేది నిపుణుల మాట. ధృడసంకల్పంతోఈ అలవాటును దూరం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు వైద్యులు, ఆధ్యాత్మిక వేత్తలు. పాటిద్దాం... మన ఆరోగ్యంతోపాటుచుట్టుపక్కల వారి ఆరోగ్యానికి భరోసానిద్దాం. డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ):సిగరెట్, గుట్కా, పాన్‌మసాలా పేరు ఏదైనా...పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. ఒక సిగరెట్లో నాలుగు వందలకు పైగా హానికర విషరసాయనాలుంటాయి. అందులో 48 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కారకాలు ఊపిరితిత్తులు, గొంతు, నాలుక వంటి భాగాలకు క్యాన్సర్‌ను సులువుగా కలుగజేస్తాయి. గర్భిణిలు ధూమపానం చేస్తే గర్భస్త శిశువు మృదు అవయవాలపై తీవ్రప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం చేసే వ్యక్తి తనకు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవారి ఊపిరితిత్తుల్లో 25 శాతం విషవాయువును ఉచితంగా పంపుతూ వారి అనారోగ్యానికి కారకుడవుతున్నాడు. దేశంలో దీని కారణంగానే ప్రతి రోజూ 2000 మంది చొప్పున.. ప్రతి ఏటా 8 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు అంచనా. నానాటికీ మహమ్మారిగా మారుతున్న ఈ విషవాయు సేవనం అలవాటును తక్షణం మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు సామాజిక కార్యకర్తలు. మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని పంచమని కోరుతున్నారు. సహజ రాజయోగతో వ్యసనాలకు విముక్తి.. డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సహజ రాజయోగం ద్వారా వ్యసనాలకు శాశ్వత విముక్తి కలుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రతినిధి బీకే రమా తెలిపారు. ప్రపంచ పొగాకు, మత్తుపానీయాల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ 300 ఏళ్లుగా పరిచయమైన పొగాకు, మత్తుపానీయాలు నేటి మానవ సమాజ నైతిక పతనానికి మూల కారణాలని చెప్పారు. ప్రపంచ వాతావరణ పరిస్థితులు, మానవ సమాజ స్థితిగతులు పరిశీలించిన్టట్లయితే వ్యసనాలు, మత్తుపదార్థాలను తక్షణమే వదిలివేస్తేనే మానవజాతిని పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని మందులు, ఎంత మంది డాక్టర్ల సలహాలు తీసుకున్నా మార్పురాని ఈ వ్యసనాలను దృఢ సంకల్పం అనే మందుతోనే మానడం సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వివిధ శాఖల ఉద్యోగులకు అవగాహన కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఎం.ఎస్.రావు, బీకే రామేశ్వరి, సత్యశ్రీ, లక్ష్మీభార్గవి తదితరులు పాల్గొన్నారు. మీకు ధూమపానం అలవాటుంటే ఇలా చేయండి... ♦ మీ వద్ద సిగరెట్, బీడీ, చుట్ట, గుట్కా వంటి వాటిని ఉంచుకోకండి.n వాటిని తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తుల నుంచి కొంత కాలం దూరంగా ఉండండి. ♦ పొగాకు సేవించడం సంపూర్ణంగా వదిలిన నాడే సంపూర్ణ ఆరోగ్యం పొందగలమనే నిజాన్ని మరువకండి. ♦ ధూమపానం చేయాలనిపించినప్పుడల్లా లవంగాలు, యాలకులు వంటి వాటిని తీసుకున్నట్టయితే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ♦ ఆరంభంలో నాలుగు వారాలు, ఆ తర్వాత 6 నెలల పాటు ఇటువంటి ప్రయత్నం చేసి నెమ్మదిగా ఈ దురలవాటు నుంచి శాశ్వత విముక్తి పొందొచ్చు. ♦ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ధూమపానానికి దూరం కావొచ్చు. ♦ మనశ్శాంతితో పాటు మనోబలం, సహనశక్తి, వృద్ధి అవుతాయని, తద్వారా వ్యసనాలపై అసహ్యం కలుగుతుందనేది మెడిటేషన్ కేంద్రాల వారి సూచన. ♦ ప్రతిరోజూ వ్యాయామం, ఆటలాడడం వంటి వాటికి సమయం ఇవ్వాలి. ఫలితంగా మస్తిష్కం పనితీరు పెరుగుతుంది. దీని వల్ల సిగరెట్ త్రాగాలనే కోరిక కలగదని చెబుతున్నారు నిపుణులు. ♦ పొగాకు సేవించడం వదిలేసిన 12 గంటల్లోనే మీకు చక్కని అనుభూతి కలుగుతుంది. లోతైన శ్వాస మీ సొంతమవుతుంది. రెండు రోజుల తర్వాత భోజనం ఎంతో రుచిగా అనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. సరదాగా మొదలై.. చాలా మంది స్మోకింగ్ అలవాటు సరదాగా మొదలుపెడతారు. ముఖ్యంగా సేల్స్ రిప్రజెంటేటివ్స్, కళాశాల విద్యార్థులు చిట్‌చాట్‌గా ప్రారంభిస్తారు. అది క్రమంగా అలవాటుగా మారి మత్తుపానీయాలకు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం తాగే సిగరెట్, పరిసర ప్రాంతాల వారిని ఇబ్బందిపెడుతుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలి.– ఎం.ఎస్.రావు, మైండ్ పవర్ అధినేత కారణాలనేకం... పొగతాగడం వలన కొత్త జబ్బులు వస్తున్నాయి. శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్లనే చాలామంది పొగాకుకు బానిసలవుతున్నారు. మరణం అనేది సహజం. సులువుగా చనిపోవాలని అందరూ కోరుకుంటారు. పొగాకు సేవించడం వల్ల భవిష్యత్తులో మంచాన పడతారు. ఈ అలవాటు మానేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మందులు వాడినా మెడిటేషన్ చాలా ముఖ్యం. – డాక్టర్ సత్యశ్రీ, చెస్ట్ ఫిజీషియన్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. యువత పొగతాగడం, మత్తు పానీయాలకు బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు పాసీవ్ స్మోకింగ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతి ఏటా 7 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారు. మన దేశంలో 30 శాతం మంది పొగతాగుతున్నారు. పొగతాగితే చావుని పెంచి పోషిస్తున్నట్టే అనే విషయం తెలుసుకోవాలి.–లక్ష్మీ భార్గవి,సంస్కృతి కళాపరిషత్నిర్వాహకురాలు అనర్థాలివే... గుట్కా తిన్నా, సిగరెట్ తాగినా..మద్యం సేవించినా క్యాన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ జబ్బులు, అల్సర్, దగ్గు, ఆయాసం, ఓపిక లేకపోవడం వంటి రోగాలకు దగ్గరవుతారు. జేబు ఖాళీ అవుతుంది. మంచానికి పరిమితమవడంతో జీవితం కష్టాలపాలవుతుంది. -
ఈ నగరానికి ఏమైంది..?
ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు మసి.. మరో వైపు పొగ.. ఎవరూ మాట్లాడరేం.. కాలే బీడీ సిగరెట్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పకుండా వచ్చే ప్రకటన. ప్రకటన చూడడమే తప్ప పొగరాయుళ్లలో ఎటువంటి చలనం కలగడం లేదు. కాల్చే సిగరెట్లో నికోటిన్ విషతుల్యమైన మత్తు పదార్ధం ఉంటుంది. సిగరెట్, బీడీ తాగే వారిలో ఈ విషం శరీరాన్ని పీల్చిపిప్పి చేస్తుంది. నేటి యువత ధూమపానాన్ని క్రేజీగా భావిస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటోంది. పొగతాగడం వ్యసనంగా మారితే ప్రాణాన్నే హరిస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. నేడు నో స్మోకింగ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి (అలిపిరి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. సిగరెట్ ప్యాకెట్‌పైనే ప్రాణాంతకం అంటూ రాసుంటుంది. అయినా పొగతాగేవారు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం విషవాయువుల నడుమ హరిస్తున్నా.. పొగతాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నేటి యువత ధూమపానాన్ని క్రేజ్‌గా భావి స్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం విధించినా చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఊపిరితిత్తులకు ముప్పు పొగ పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. హానికర కార్బ న్ డైయాక్సైడ్ ఇతరత్రా వాయువులు విడిపోతాయి. ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ పీల్చుకుని మిగిలిన వాయువులను బయటకు పంపుతుంది. పొగ తాగడం వల్ల శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్ వంటి విష పదార్థాలు గాలి గదిలో చేరి హిమోగ్లోబిన్‌తో గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. దీంతో హిమోగ్లోబిన్‌కు ఆక్సిజన్ మోసుకుపోయే సామర్ధ్యం తగ్గి కార్బన్ మోనాక్సైడ్‌తో కణాలు విషపూరితమవుతాయి. ఫలితంగా పలు వ్యాధులు సోకుతాయి. పీల్చేవారికీ ప్రమాదమే పొగ తాగేవారి కంటే పీల్చే వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారిని యాక్టివ్ స్మోకర్గా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్గా పిలుస్తారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారు కూడా పలు రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం, ఒక వేళ పిండం ఎదిగినా చివర్లో మృత శిశువులు జన్మించడం వంటి సమస్యలు మహిళలను వేధించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 2.5 కోట్ల మంది పొగతాగే వారున్నట్లు అంచనా. ఒక సిగరెట్ తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేస్తే, 20 ఏళ్ల తరువాత లంగ్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గొంతు క్యాన్సర్ పొగ తాగేవారిలో నోటి, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గొంతులో ఉండే ప్రతి అవయవమూ పొగబారినపడి క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం వుంది. గొంతులో ఉండే స్వరపేటిక, థైరాయిడ్, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెల్లే బ్రాంకియా.. ఇలా ప్రతి భాగమూ దెబ్బతిని అవయవాలన్నింటికీ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగతాగే వారిలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. నష్టం ఎంతంటే.. ♦ ఒక సిగరెట్ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయి. ఎంఫసియా,క్రానిక్ అబ్స్ట్రిక్టవ్ పల్మ్నరీ డిసీజ్ లాంటి ప్రమాదకర మైన వ్యాధులు సోకుతాయి. ♦ బ్రెయిన్ స్ట్రోక్‌కు అవకాశం ఎక్కువ. ♦ దుర్వాసనతో నోరు,పెదాలు, నాలుక క్యాన్సర్లు వస్తాయి. ♦ ముఖంపై మచ్చలు ఏర్పడుతాయి. ♦ పళ్లు రంగు మారుతాయి. ♦ కనుగుడ్డు మీదా ప్రభావం ఉంటుంది. ♦ ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుంది. ♦ గుండెపోటుకు అవకాశం ఎక్కువ. ♦ రక్త ప్రసరణ ప్రక్రియ మందగిస్తుంది. ♦ కడుపులో ప్రమాదకర యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. ♦ మూత్రాశయం..మూత్రపిండాలు దెబ్బతింటాయి. ♦ శరీరంలో అన్ని భాగాలు దెబ్బతింటాయి. ♦ పొగపీల్చే మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అమలుకు నోచుకోని చట్టాలు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నా అవి పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. బహిరంగంగా పొగ తాగుతూ అధికారులకు పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా.. రెండో సారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా.. ఒక్కో సందర్భంలో రెండు శిక్షలు అమలు చేయవచ్చు. ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ 2014లో చట్టంలో నిబంధనలు మార్చాలని భావించి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం ధూమపాన సేవనానికి ఉన్న వయోపరిమితిని 18 నుంచి 25 ఏళ్లుగా చేసింది. నిబంధన అమలుకు నోచుకోలేదు. 2003లో పొగాకు నిషేధ చట్టం ప్రకారం విశ్వ విద్యాలయాల్లో వంద గజాల దూరంలో ఎలాంటి పొగాకు విక్రయ కేంద్రాలు ఉండకూడదు. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం ఒక సిగరెట్ తాగితే ఏమౌతుందులో అనే అలోచను విడనాడాలి. పొగ, గుట్కాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారినపడుతుంది. దీంతో శరీరాన్ని విష వాయువు పీల్చిపిప్పి చేసే ప్రమాదం ఉంది. యువత స్టైల్ కోసం స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు అలవాటుపడి వారు చాల ఏళ్లు పాటు ఇబ్బందులు పడితేగాని మానలేకపోతున్నారు. స్మోకింగ్‌కు దూరంగా వుండడం ఉత్తమం. – డాక్టర్ ఎస్.సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్, పల్మొనరీ మెడిసిన్, రుయా ఆస్పత్రి సున్నిత పొరలకు ప్రమాదం ధూమపానంతో కళ్లు, ముక్కు, గొంతులో సున్నిత పొరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గుండె పోటు వచ్చే శాతం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పొగతాగడానికి యువత దూరంగా వుండాలి. – డాక్టర్ సూర్యప్రకాష్, సీనియర్ పాల్మనాలజిస్ట్, తిరుపతి -
పొగరాణులు పెరిగిపోతున్నారు బాబోయ్!!
భారతీయుల్లో పొగతాగే అలవాట్లు క్రమంగా మారిపోతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, సాంస్కృతిక కేంద్రాలు, బస్టాపులు.. ఇలా ఎక్కడ చూసినా ఉఫ్. ఉఫ్.. అంటూ పొగతాగే పొగరాణుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఓవైపు అబ్బాయిలు తమ జేబు బరువును, ఆరోగ్యాన్ని చూసుకుని కాస్తంత జాగ్రత్త పడుతుంటే.. అమ్మాయిలు మాత్రం అదేమీ లెక్కచేయకుండా పొలోమంటూ పొగ తాగేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్లనూ తాగిస్తున్నారు. దీంతో సంతానరాహిత్యం, కేన్సర్ లాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. 1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల ధూమపాన అలవాట్లు, పోకడలను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ వైద్య పత్రికలు ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, మహిళల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తుంటుంది. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట. మొదట్లో సిగరెట్లు కాల్చేవాళ్లు రోజుకు నాలుగైదు మాత్రమే కాలుస్తారని, దానివల్ల వాళ్ల ఆరోగ్యంలో కూడా పెద్దగా తేడా కనపడదని.. అదే కొన్నాళ్ల తర్వాత మాత్రం సిగరెట్ల సంఖ్య పెరుగుతుందని .. దానివల్ల ఆడవాళ్లలో అయితే సంతానరాహిత్యం సమస్య చాలా ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికితోడు పొగతాగే అలవాటు వల్ల పలురకాల కేన్సర్ కేసులు కూడా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ తయారీ సంస్థలపై విపరీతంగా కేసులు నమోదయ్యాయని, అందువల్ల అక్కడి కేసులను వదిలించుకుని బయటపడటం కంటే భారత్, చైనా లాంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు పొగతాగే అలవాటు పెంచితే తమ అమ్మకాలు పెరుగుతాయని కుట్రపన్ని, సిగరెట్లు కాల్చడాన్ని ఒక సోషల్ స్టేటస్‌గా అవి మార్చేస్తున్నాయని సప్నా నంగియా అనే కేన్సర్ వైద్య నిపుణురాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని, ఇప్పటికైనా పొగరాయుళ్లు, పొగరాణులు ఆ అలవాటును మానుకోవడం మంచిది.