పొగ.. పగ సాధిస్తోంది. సరదా.. సరదా సిగరెట్టు..అనారోగ్యానికి తొలిమెట్టులా మారిపోయింది.ఎంతటి ఒత్తిడి నుంచైనా సిగరెట్, బీడీ, చుట్టలు ఉపశమనంకలిగిస్తాయని, అవి లేనిదే జీవితం లేదని గొప్పలు చెప్పే పొగరాయుళ్లు.. వైద్యులు చెప్పే విషయాలు చదివితే గుండెజారడం ఖాయం.ధూమపానం వలన గుండెతో పాటు జేబుకూ చిల్లు తప్పదు.ఆ విషయం తెలుసుకునేలోపే సిగరెట్ పొగలాగే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయనేది నిపుణుల మాట. ధృడసంకల్పంతోఈ అలవాటును దూరం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు వైద్యులు, ఆధ్యాత్మిక వేత్తలు. పాటిద్దాం... మన ఆరోగ్యంతోపాటుచుట్టుపక్కల వారి ఆరోగ్యానికి భరోసానిద్దాం.
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ):సిగరెట్, గుట్కా, పాన్‌మసాలా పేరు ఏదైనా...పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. ఒక సిగరెట్‌లో నాలుగు వందలకు పైగా హానికర విషరసాయనాలుంటాయి. అందులో 48 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కారకాలు ఊపిరితిత్తులు, గొంతు, నాలుక వంటి భాగాలకు క్యాన్సర్‌ను సులువుగా కలుగజేస్తాయి. గర్భిణిలు ధూమపానం చేస్తే గర్భస్త శిశువు మృదు అవయవాలపై తీవ్రప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం చేసే వ్యక్తి తనకు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవారి ఊపిరితిత్తుల్లో 25 శాతం విషవాయువును ఉచితంగా పంపుతూ వారి అనారోగ్యానికి కారకుడవుతున్నాడు. దేశంలో దీని కారణంగానే ప్రతి రోజూ 2000 మంది చొప్పున.. ప్రతి ఏటా 8 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు అంచనా. నానాటికీ మహమ్మారిగా మారుతున్న ఈ విషవాయు సేవనం అలవాటును తక్షణం మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు సామాజిక కార్యకర్తలు. మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని పంచమని కోరుతున్నారు.
సహజ రాజయోగతో వ్యసనాలకు విముక్తి..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సహజ రాజయోగం ద్వారా వ్యసనాలకు శాశ్వత విముక్తి కలుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రతినిధి బీకే రమా తెలిపారు. ప్రపంచ పొగాకు, మత్తుపానీయాల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ 300 ఏళ్లుగా పరిచయమైన పొగాకు, మత్తుపానీయాలు నేటి మానవ సమాజ నైతిక పతనానికి మూల కారణాలని చెప్పారు. ప్రపంచ వాతావరణ పరిస్థితులు, మానవ సమాజ స్థితిగతులు పరిశీలించిన్టట్లయితే వ్యసనాలు, మత్తుపదార్థాలను తక్షణమే వదిలివేస్తేనే మానవజాతిని పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని మందులు, ఎంత మంది డాక్టర్ల సలహాలు తీసుకున్నా మార్పురాని ఈ వ్యసనాలను దృఢ సంకల్పం అనే మందుతోనే మానడం సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వివిధ శాఖల ఉద్యోగులకు అవగాహన కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఎం.ఎస్.రావు, బీకే రామేశ్వరి, సత్యశ్రీ, లక్ష్మీభార్గవి తదితరులు పాల్గొన్నారు.
మీకు ధూమపానం అలవాటుంటే ఇలా చేయండి...
♦ మీ వద్ద సిగరెట్, బీడీ, చుట్ట, గుట్కా వంటి వాటిని ఉంచుకోకండి.n వాటిని తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తుల నుంచి కొంత కాలం దూరంగా ఉండండి.
♦ పొగాకు సేవించడం సంపూర్ణంగా వదిలిన నాడే సంపూర్ణ ఆరోగ్యం పొందగలమనే నిజాన్ని మరువకండి.
♦ ధూమపానం చేయాలనిపించినప్పుడల్లా లవంగాలు, యాలకులు వంటి వాటిని తీసుకున్నట్టయితే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
♦ ఆరంభంలో నాలుగు వారాలు, ఆ తర్వాత 6 నెలల పాటు ఇటువంటి ప్రయత్నం చేసి నెమ్మదిగా ఈ దురలవాటు నుంచి శాశ్వత విముక్తి పొందొచ్చు.
♦ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ధూమపానానికి దూరం కావొచ్చు.
♦ మనశ్శాంతితో పాటు మనోబలం, సహనశక్తి, వృద్ధి అవుతాయని, తద్వారా వ్యసనాలపై అసహ్యం కలుగుతుందనేది మెడిటేషన్ కేంద్రాల వారి సూచన.
♦ ప్రతిరోజూ వ్యాయామం, ఆటలాడడం వంటి వాటికి సమయం ఇవ్వాలి. ఫలితంగా మస్తిష్కం పనితీరు పెరుగుతుంది. దీని వల్ల సిగరెట్ త్రాగాలనే కోరిక కలగదని చెబుతున్నారు నిపుణులు.
♦ పొగాకు సేవించడం వదిలేసిన 12 గంటల్లోనే మీకు చక్కని అనుభూతి కలుగుతుంది. లోతైన శ్వాస మీ సొంతమవుతుంది. రెండు రోజుల తర్వాత భోజనం ఎంతో రుచిగా అనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
సరదాగా మొదలై..
చాలా మంది స్మోకింగ్ అలవాటు సరదాగా మొదలుపెడతారు. ముఖ్యంగా సేల్స్ రిప్రజెంటేటివ్స్, కళాశాల విద్యార్థులు చిట్‌చాట్‌గా ప్రారంభిస్తారు. అది క్రమంగా అలవాటుగా మారి మత్తుపానీయాలకు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం తాగే సిగరెట్, పరిసర ప్రాంతాల వారిని ఇబ్బందిపెడుతుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలి.– ఎం.ఎస్.రావు, మైండ్ పవర్ అధినేత
కారణాలనేకం...
పొగతాగడం వలన కొత్త జబ్బులు వస్తున్నాయి. శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్లనే చాలామంది పొగాకుకు బానిసలవుతున్నారు. మరణం అనేది సహజం. సులువుగా చనిపోవాలని అందరూ కోరుకుంటారు. పొగాకు సేవించడం వల్ల భవిష్యత్తులో మంచాన పడతారు. ఈ అలవాటు మానేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. మందులు వాడినా మెడిటేషన్ చాలా ముఖ్యం.
– డాక్టర్ సత్యశ్రీ, చెస్ట్ ఫిజీషియన్
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
యువత పొగతాగడం, మత్తు పానీయాలకు బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు పాసీవ్ స్మోకింగ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతి ఏటా 7 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారు. మన దేశంలో 30 శాతం మంది పొగతాగుతున్నారు. పొగతాగితే చావుని పెంచి పోషిస్తున్నట్టే అనే విషయం తెలుసుకోవాలి.–లక్ష్మీ భార్గవి,సంస్కృతి కళాపరిషత్‌నిర్వాహకురాలు
అనర్థాలివే...
గుట్కా తిన్నా, సిగరెట్ తాగినా..మద్యం సేవించినా క్యాన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ జబ్బులు, అల్సర్, దగ్గు, ఆయాసం, ఓపిక లేకపోవడం వంటి రోగాలకు దగ్గరవుతారు. జేబు ఖాళీ అవుతుంది. మంచానికి పరిమితమవడంతో జీవితం కష్టాలపాలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment