పొగరాణులు పెరిగిపోతున్నారు బాబోయ్!!
భారతీయుల్లో పొగతాగే అలవాట్లు క్రమంగా మారిపోతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, సాంస్కృతిక కేంద్రాలు, బస్టాపులు.. ఇలా ఎక్కడ చూసినా ఉఫ్. ఉఫ్.. అంటూ పొగతాగే పొగరాణుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఓవైపు అబ్బాయిలు తమ జేబు బరువును, ఆరోగ్యాన్ని చూసుకుని కాస్తంత జాగ్రత్త పడుతుంటే.. అమ్మాయిలు మాత్రం అదేమీ లెక్కచేయకుండా పొలోమంటూ పొగ తాగేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్లనూ తాగిస్తున్నారు. దీంతో సంతానరాహిత్యం, కేన్సర్ లాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల ధూమపాన అలవాట్లు, పోకడలను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ వైద్య పత్రికలు ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, మహిళల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తుంటుంది. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట.
మొదట్లో సిగరెట్లు కాల్చేవాళ్లు రోజుకు నాలుగైదు మాత్రమే కాలుస్తారని, దానివల్ల వాళ్ల ఆరోగ్యంలో కూడా పెద్దగా తేడా కనపడదని.. అదే కొన్నాళ్ల తర్వాత మాత్రం సిగరెట్ల సంఖ్య పెరుగుతుందని .. దానివల్ల ఆడవాళ్లలో అయితే సంతానరాహిత్యం సమస్య చాలా ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికితోడు పొగతాగే అలవాటు వల్ల పలురకాల కేన్సర్ కేసులు కూడా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ తయారీ సంస్థలపై విపరీతంగా కేసులు నమోదయ్యాయని, అందువల్ల అక్కడి కేసులను వదిలించుకుని బయటపడటం కంటే భారత్, చైనా లాంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు పొగతాగే అలవాటు పెంచితే తమ అమ్మకాలు పెరుగుతాయని కుట్రపన్ని, సిగరెట్లు కాల్చడాన్ని ఒక సోషల్ స్టేటస్గా అవి మార్చేస్తున్నాయని సప్నా నంగియా అనే కేన్సర్ వైద్య నిపుణురాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని, ఇప్పటికైనా పొగరాయుళ్లు, పొగరాణులు ఆ అలవాటును మానుకోవడం మంచిది.