indian men
-
భారతీయ పురుషుల్లో వంధ్యత్వం
తార్నాక: పురుషుల్లో అతి ముఖ్యమైన ‘వై–క్రోమోజోమ్’ దెబ్బతినడం వల్ల భారతీయ పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. పురుషుల్లో వై–క్రోమోజోమ్లోని లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బ తీస్తున్నట్టు గుర్తించారు. దీనిపై రెండు దశాబ్దాలుగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ)లో చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. మానవుల్లో వంధ్యత్వానికి పురుషుల్లో ఉండే వై–క్రోమోజోమ్లోని లోపాలే ప్రధాన కారణమని సీసీఎంబీకి చెందిన డాక్టర్ తంగరాజ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. భారతీయుల్లోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు వంధ్యత్వానికి గురువుతున్నారని వారు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లోని వై–క్రోమోజోమ్ అనేకరకాల జన్యువులను కలిగి ఉంటుంది. అది స్పెర్మటోజెనిసిస్, శుక్రకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అయితే మగవారిలో ఆనారోగ్యం, గాయాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు.. జీవనశైలి, పరిసరాల ప్రభావం వై–క్రోమోజోమ్ ఉత్పిత్తి చేసే శుక్రకణాలు విడుదలకు అడ్డంకులు కలిగిస్తాయని, ఈ కారణాలే మగవారిలో వంధ్యత్వానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8.5 శాతం కేసుల్లో ఈ లక్షణాలు బయటపడినట్టు వారు వెల్లడించారు. ప్రస్తుత అధ్యయనంలోౖ వై–క్రోమోజోమ్ల లోపాలపై సూక్ష్మ, స్థూల అధ్యయనాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అజూస్పెర్మా ఫ్యాక్టర్లోని మూడు పొడవైన వై–క్రోమోజోమ్ స్పెర్మటోజెనిసిస్లను ఉపయోగించి 587 మంది పరిపూర్ణమైన ఫెర్టిలిటీ గల వారు, 973 మంది వంధ్యత్వ లక్షణాలు గలవారిలోని శుక్రకణాల ఫలదీకరణపై పరిశోధన చేయగా, 29.4 శాతం భారతీయ పురుషుల్లో క్రోమోజోములు తగ్గిపోతున్నట్టు గుర్తించారు. వై–క్రోమోజోమ్ తొలగింపు అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని వారు తేల్చారు. -
గోల్డ్ బార్స్తో అక్కడ దొరికిపోయాడు..
ఢాకా : భారత్కు చెందిన అర్షద్ అయాజ్ అహ్మద్ రూ 4.7 కోట్ల విలువైన బంగారు కడ్డీలతో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. థాయ్ ఎయిర్లైన్స్ విమానంలో థాయ్లాండ్ నుంచి అర్షద్ అహ్మద్ ఢాకా చేరుకున్నాడని స్ధానిక మీడియా వెల్లడించింది. ఎయిర్పోర్ట్ గ్రీన్ఛానెల్లో సిబ్బంది తనిఖీ చేయగా భారీగా బంగారం పట్టుబడిందని ఢాకా కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ ఒథెల్లో ఛౌధురి తెలిపారు. అహ్మద్ నుంచి రూ 4.7 కోట్ల విలువైన 22 గోల్డ్ బార్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న అయాజ్ను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగించామని బంగ్లా కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కాగా, ఢాకా ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు ఇటీవల భారీగా చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?
పని చేయడంలో మగవాళ్ల కంటే మగువలు ముందుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రోజు మొత్తమ్మీద మగవాళ్ల కంటే ఆడాళ్లే ఎక్కువ సేపు పనిచేస్తారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున ఏడాదికి మహిళలు 39 రోజులు ఎక్కువ పనిచేస్తారు. అదే భారతదేశంలో అయితే 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని అంటున్నారు. సగటున పురుషుల కంటే మహిళలు 50 నిమిషాలు ఎక్కువగా పనిచేస్తారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాలలో మాత్రమే మహిళల కంటే పురుషులు ఎక్కువ గంటలు పనిచేస్తారట. అయితే వీటిలో మూడు దేశాల్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగానికి వెళ్తే, మరొకరు పిల్లల సంరక్షణ బాధ్యతను చూసుకుంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్న వెసెలినా రచేవా చెప్పారు. మహిళల కంటే పురుషులకు 34 శాతం వరకు ఎక్కువ జీతాలున్నా, మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారంటున్నారు. చాలావరకు ఇంటి పని, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి పనులు చేస్తున్నా, వాటికి జీతభత్యాలు ఏమీ ఉండవని చెప్పారు. దీంతో కలిపి చూసుకుంటేనే ఏడాది మొత్తమ్మీద పురుషుల కంటే ఎక్కువసేపు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. భారతదేశం, పోర్చుగల్, ఈస్టోనియా దేశాల్లో మహిళలు ఏడాది మొత్తమ్మీద 50 రోజులు ఎక్కువ పనిచేస్తున్నారన్నారు. -
పొగరాణులు పెరిగిపోతున్నారు బాబోయ్!!
భారతీయుల్లో పొగతాగే అలవాట్లు క్రమంగా మారిపోతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, సాంస్కృతిక కేంద్రాలు, బస్టాపులు.. ఇలా ఎక్కడ చూసినా ఉఫ్. ఉఫ్.. అంటూ పొగతాగే పొగరాణుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఓవైపు అబ్బాయిలు తమ జేబు బరువును, ఆరోగ్యాన్ని చూసుకుని కాస్తంత జాగ్రత్త పడుతుంటే.. అమ్మాయిలు మాత్రం అదేమీ లెక్కచేయకుండా పొలోమంటూ పొగ తాగేస్తున్నారు, చుట్టుపక్కల వాళ్లనూ తాగిస్తున్నారు. దీంతో సంతానరాహిత్యం, కేన్సర్ లాంటి ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. 1980 నుంచి 2012 వరకు మొత్తం 187 దేశాల్లోని ప్రజల ధూమపాన అలవాట్లు, పోకడలను పరిశీలించిన అమెరికన్, బ్రిటిష్ వైద్య పత్రికలు ఈ మార్పును స్పష్టంగా గమనించాయి. భారతీయ పురుషుల్లో పొగ తాగేవారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతే, మహిళల్లో మాత్రం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చుట్టలు, తంబాకు.. ఇలా ఏదో ఒకపేరుతో పొగతాగే మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా కనిపిస్తుంటుంది. 1980 నాటికి మన దేశంలో దాదాపు 53 లక్షల మంది పొగరాణులుంటే, 2012 నాటికి ఆ సంఖ్య ఏకంగా 1.22 కోట్లకు చేరుకుంది. అంటే రెట్టింపునకు పైగా పెరిగిపోయిందన్న మాట. మొదట్లో సిగరెట్లు కాల్చేవాళ్లు రోజుకు నాలుగైదు మాత్రమే కాలుస్తారని, దానివల్ల వాళ్ల ఆరోగ్యంలో కూడా పెద్దగా తేడా కనపడదని.. అదే కొన్నాళ్ల తర్వాత మాత్రం సిగరెట్ల సంఖ్య పెరుగుతుందని .. దానివల్ల ఆడవాళ్లలో అయితే సంతానరాహిత్యం సమస్య చాలా ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికితోడు పొగతాగే అలవాటు వల్ల పలురకాల కేన్సర్ కేసులు కూడా భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో సిగరెట్ తయారీ సంస్థలపై విపరీతంగా కేసులు నమోదయ్యాయని, అందువల్ల అక్కడి కేసులను వదిలించుకుని బయటపడటం కంటే భారత్, చైనా లాంటి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు పొగతాగే అలవాటు పెంచితే తమ అమ్మకాలు పెరుగుతాయని కుట్రపన్ని, సిగరెట్లు కాల్చడాన్ని ఒక సోషల్ స్టేటస్గా అవి మార్చేస్తున్నాయని సప్నా నంగియా అనే కేన్సర్ వైద్య నిపుణురాలు చెప్పారు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకుని, ఇప్పటికైనా పొగరాయుళ్లు, పొగరాణులు ఆ అలవాటును మానుకోవడం మంచిది.