సిస్టర్ నిర్మల కన్నుమూత
* మదర్ థెరిసా అనంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథి
* అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన నిర్మల
* మదర్ హౌస్‌కు భౌతికకాయం... నేడు అంత్యక్రియలు
* రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, సోనియా, రాహుల్‌ల సంతాపం
కోల్‌కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రతినిధి కలకత్తా ఆర్చిబిషప్ ఫాదర్ థామస్ డిసౌజా పేర్కొన్నారు. ఆమె భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం మదర్ హౌస్‌కు తీసుకువస్తామని.. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. సిస్టర్ అస్తమించిన వార్త తెలియగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్ జాన్స్ చర్చికి వెళ్లి నివాళులర్పించారు. సిస్టర్ జీవితమంతా మానవాళి సేవకు అంకితంచేశారని మమత కొనియాడారు.
మదర్ థెరిసా మరణించిన తర్వాత ఆరు నెలలకు 1997 మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా ఎంపకయ్యారు. ఆమె వారసురాలిగా సిస్టర్ మేరీ ప్రేమను 2009 ఏప్రిల్‌లో కోల్‌కతాలో జరిగిన జనరల్ చాప్టర్ సమావేశంలో ఎన్నుకున్నారు. సిస్టర్ నిర్మల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.
పేదలకోసం అంకితం చేసిన ఆమె జీవితం స్ఫూర్తి దాయకమని ప్రణబ్ పేర్కొన్నారు. ‘పేదలు, అణగారిన వారి సేవకు, పరిరక్షణకు సిస్టర్ నిర్మల తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మానవాళికి సేవలో భాగంగా ఆమె కలుసుకున్న లక్షలాది ప్రజలకు ఆమె లేని లోటు తీర్చలేనిదని సోనియా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మదర్ థెరిసా కృషిని సిస్టర్ నిర్మల అంకితభావంతో, గౌరవప్రదంగా కొనసాగించారని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు.
స్ఫూర్తి ప్రదాత.. కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనేక చారిటీ సంస్థలను నిస్వార్థ సేవా దృక్పథంతో నిర్వహించిన నిర్మల స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్లాఘించారు.
చరితార్థురాలు: చంద్రబాబు
సిస్టర్ నిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మదర్ థెరిసా సేవామార్గంలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న నిర్మల చరితార్థురాలని కొనియాడారు.
పేదల పాలిట పెన్నిధి: వైఎస్ జగన్
సిస్టర్ నిర్మల మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నిరుపేద లు, అణగారిన వర్గాలతో పాటు బాధల్లో ఉన్న వారి సేవలకే తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నిర్మల మృతి చెందడం తీరని దుఃఖాన్ని కలుగ జేసిందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.