సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ విజేతలు
తిరుపతి: ఎస్వీయూనివర్సిటీలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు 9 మంది నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరవుతారని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీ.నారాయణరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఒక ప్రవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు 9 మంది నోబెల్ విజేతలు హాజరవుతారన్నారు. వీరిలో ముగ్గురు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన వారే ఉన్నారని తెలిపారు.
అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కూడా హాజరవుతారని చెప్పారు. సదస్సుకు 10 నుంచి 12 వేల మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు ఉదయం నోబెల్ విజేతలతో ఉపన్యాసాలు, మధ్యాహ్నం నుంచి పరిశోధన పత్రాల సమర్పణ ఉంటుందని నారయణరావు అన్నారు. సమావేశంలో ప్రధానంగా ఆహార భద్రత, సౌరశక్తి, ఫోటోవోల్టాయిక్ అండ్ థర్మల్, బ్లూ ఎకానమీ-భారతీయ కృషి, డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ సిటీలు, సైబర్ సెక్యూరిటీ, స్వచ్చ భారత్, సైన్స్ విద్య- పరిశోధన, జినోమ్ ఎడిటింగ్, హ్యుమన్ మైక్రోనమీ, గ్రావిటేషన్ వేవ్స్, భారతీయ నైరుతి ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పొరుగుదేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తదితర అంశాలపై సమగ్ర చర్చలు జరుగుతాయన్నారు. వ్యవసాయం, అటవీ శాస్త్రం, పశువులు, పశుసంవర్ధకం, మత్స్య శాస్త్రం, ఇంజనీరింగ్ సెన్సైస్, పర్యావరణ శాస్త్రం, సమాచార ప్రసార సాంకేతికత, మెటీరియల్ సైన్స్, వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం,రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, బయోటెక్నాలజీ తదితర అంశాలపై సమాంతర సమావేశాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో లోకల్ సెక్రటరీ ఎస్.విజయభాస్కర్‌రావు పాల్గొన్నారు.