36 నామినేషన్ల తిరస్కరణ
ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో 36 నామినేషన్లు తిరస్కరించారు. సోమవారం కలెక్టర్ లోకేష్‌కుమార్ చాంబర్లో అనంతపురం లోక్‌సభ స్థానాల నామినేషన్లు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ చాంబర్లో హిందూపురం లోక్‌సభ స్థానాల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. అసెంబ్లీ నామినేషన్ల పరిశీలనను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల చాంబర్లలో చేపట్టారు.
అనంతపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 17 నామినేషన్లలో ధ్రువీకరణ పత్రాలు జత చేయకపోవడంతో 3 నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 14 నామినేషన్లను ఆమోదించారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 14 నామినేషన్లూ సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 266 నామినేషన్న్లు రాగా అధికారుల పరిశీలనలో 33 తిరస్కరణకు గురయ్యాయి.
233 నామినేషన్లను ఆమోదించారు. ప్రధాన పార్టీల నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. పలువురు స్వతంత్ర, డమ్మీ అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు తిరస్కరించారు. శింగనమలలో అత్యధికంగా 9 నామినేషన్లు తిరస్కరించారు. అనంతపురం అర్బన్, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గంలో దాఖలైన నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి.
23 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రస్తుతం ఆమోదం తెలిపిన వాటిలో రెబల్స్, ఇతర అభ్యర్థులు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటిస్తారు.