nomulu
-
అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్..
రాయవరం: అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్.. అంటూ మహిళలు ఆటపాటలతో కోలాహలంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ముఖ్యంగా వివాహమైన అనంతరం నవ వధువు అట్లతద్ది పండగను తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ. మాంగళ్య బలం కోసం గౌరీదేవిని భక్తితో కొలిచే ఈ పర్వదినాన్ని ఆశ్వీ యుజ మాసం బహుళ తదియ నాడు నోయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల (అక్టోబర్) 12న అట్లతద్ది పర్వదినం సందర్భంగా పూజకు ఏర్పాట్లు చేసుకునే పనిలో మహిళలు నిమగ్నమై ఉన్నారు. ఇస్తినమ్మ వాయనం.. మహిళలు నోచే నోముల్లో అతి ముఖ్యమైనది అట్లతద్ది పండుగ. వేకువజామునే లేచి స్నానపానాదుల అనంతరం ఐదు గంటల లోపుగా భోజనం చేసి వ్రతాన్ని ప్రారంభిస్తారు. మజ్జిగ అన్నం, గోంగూర పచ్చడి, నువ్వులపొడి, ఉల్లిపాయల పులుసు, గడ్డపెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కొత్తగా పెళ్లైన యువతులు తప్పనిసరిగా అట్లతో వాయనాలు ఇస్తారు. సాయంత్రం సమయంలో కాలువ వద్దకు వెళ్లి కాలువలో మట్టిని, వరిదుబ్బులను, నవధాన్యాలతో తయారుచేసిన జాజాల బుట్టలను గౌరీదేవిగా భావించి పూజలు చేస్తారు. నీళ్లలో గౌరమ్మ.. పాలల్లో గౌరమ్మ అంటూ పాటపాడుతూ పూజ అనంతరం వాటిని కాలువలో కలుపుతారు. అట్లతద్దికి ఐదురోజుల ముందుగా చిన్నచిన్న బుట్టల్లో మట్టి వేసి అందులో మెంతులు, పెసలు, కందులు, పత్తి తదితర నవధాన్యాలను వేస్తారు. అట్లతద్ది రోజున మొలకలు వచ్చే విధంగా చూస్తారు. వీటినే జాజాలు అంటారు. ఉయ్యాల ఊగుతూ.. గోరింటాకు పెట్టుకుంటూ.. అట్లతద్ది రోజున మహిళలు తప్పనిసరిగా ఉయ్యాల ఊగుతారు. అదేవిధంగా అట్లతద్దికి ముందురోజున మహిళలు గోరింటాకు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కాలువల వద్దకు వెళ్లే సమయంలో పెళ్లిపీటలపై కట్టుకున్న పట్టుచీరను తప్పనిసరిగా ధరిస్తారు. ఉదయం నుంచి కటిక ఉపవాసం చేసే మహిళలు సాయంత్రం పూజ అనంతరం చంద్రదర్శనం కోసం వేచిచూస్తారు. చంద్రుడు కనిపించాక పూజ చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం, రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో అట్లతద్ది నోముకు మహిళలు సిద్ధమవుతున్నారు. నోముకు అవసరమైన పూజా సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో మహిళలు ఉన్నారు. ఏటా నోచుకుంటాం ఏటా తప్పనిసరిగా అట్లతద్ది నోము నోచుకుంటాను. ఈ ఏడాది నోముకి ఇప్పటికే జాజాలు సిద్ధం చేసుకున్నాం. పూజకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్నాం. – పులగం శివకుమారి, గృహిణి, రాయవరం సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. అట్లతద్ది రోజు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారిని పూజించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వేడుక మహిళలకు ప్రత్యేకం. – కొప్పిశెట్టి లక్ష్మి, గృహిణి, అద్దంపల్లి, కె.గంగవరం మండలం వాయనాలు ప్రధానం హిందూ సంప్రదాయంలో అట్టతద్దికి పెళ్లైన ఏడాది నవ వధువులు వాయనాలు తీర్చుకోవడం ఈ పర్వదినంలో ప్రధానమైన ప్రక్రియ. అట్లతద్దిని మన ప్రాంతంలో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనాదిగా వస్తోంది. – విలపర్తి ఫణిధర్శర్మ, అర్చకులు, రాయవరం -
దీపావళి నోము: మనోబలానికి సంకల్పం
‘ఏ పని తలపెడుతున్నామో అది పూర్తయ్యేంతవరకు మనలో సంకల్పం బలంగా ఉండాలి’ అంటారు పెద్దలు. కుటుంబ శ్రేయస్సుకు తపించే మనసుకు తగినంత బలం అందాలంటే అందుకు దైవ శక్తి కూడా తోడవ్వాలి అనేది పండితుల వాక్కు. అందుకే, అనాది నుంచి కుటుంబ క్షేమం కోసం చేసే దైవారాధనలలో నోములు, వ్రతాలు మన జీవనంలో ఓ భాగమయ్యాయి. వాటిలో కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున చేసుకునే కేదారేశ్వర వ్రతం (నోము)కు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ దేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుడిని పూజించి, ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు. కల్పవల్లి.. పాలవెల్లి.. పీఠం మధ్యన ధాన్యరాశిని పోసి, అందులో పూర్ణకుంభాన్ని ఉంచి, ఇరవై ఒక్క దారాలతో సూత్రాన్ని చుట్టి, గంధ పుష్పాక్షతలను ఉంచాలి. పీఠానికి పై భాగాన మామిడి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించిన పాలవెల్లిని అమర్చుకోవాలి. పసుపు గౌరి, పసుపు గణపతి. జాకెట్టు ముక్క, నోము దండ, 21 తమలపాకులు, 21 నల్ల పోకలు, 21 ఖర్జూర పండ్లు. వత్తిపత్తి, పసుపు, కుంకుమ, 2 ఎండుకొబ్బరి చిప్పలు, 2 కొబ్బరికాయలు, హారతి కర్పూరం, కంకణం(చేతికి కట్టుకునే తోరం), ధూప, దీప, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. గౌరీ తనయుడితో ఆరంభం.. ముందుగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి (పసుపు గణపతిని) ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని, సంకల్పం చెప్పుకోవాలి. కేదారేశ్వరుని ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృతస్నానం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలతో షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అథాంగపూజ, అష్టోత్తర శతనామ పూజ, అధసూత్ర గ్రంధిపూజ చేసి శ్రీ కేదారేశ్వర వ్రత కథ విని, బ్రాహ్మణులు, పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాస దీక్షను విరమిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే నోముదండలను మెడలో ధరించి, పసుపు, కుంకుమ, పండు, ఆకు, వక్కలను ముల్తైదువులకు వాయినంగా ఇవ్వడంతో నోము పూర్తవుతుంది. మరుసటి ఏడాది దీపావళి నోము వరకు తమ ఇంట కేదారేశ్వరుని అనుగ్రహంతో ఆయురారోగ్య, సౌభాగ్య, ఐశ్వర్యాభివృద్ధి మెండుగా కలుగుతుందన్న నమ్మకమే కొండంత అండగా భక్తులు తమ జీవనప్రయాణాన్ని కొనసాగిస్తారు. సర్వేజనా సుఖినోభవంతు! -
అట్లతద్ది వేడుకలు