బ్రిటన్ వీసా పాలసీ ఇక టైట్..
లండన్: దేశంలో వలస దారులు సంఖ్య భారీగా పెరగడంతో బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టంలో భారీ మార్పులు ప్రకటించింది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మూడు రోజుల పర్యటనకు కొద్ది రోజులముందు అక్కడి ప్రభుత్వం ఈ మార్పులను గురువారం వెల్లడించింది. ఈయూ యేతర దేశాల ఉద్యోగ వీసా( టైర్ 2) జారీలో భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా భారతదేశ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే టైర్-2 వీసా నిబంధనల్లో గణనీయమైనమార్పులు చేసింది. దీంతో ప్రభావంమన దేశ ఐటీ ప్రొఫెషనల్స్ పై భారీగా పడనుంది. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం, ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు
తమ దేశంలో వెల్లువలా నమోదవుతున్న ఇమ్మిగ్రేషన్ గణాంకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 24 తర్వాత దరఖాస్తు చేసుకునే టైర్ 2 వీసాదారులు (ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్) అందుకోవాల్సిన వార్షిక జీతాన్ని 20, 800 పౌండ్లనుంచి 30 వేల పౌండ్లకు పెంచింది. టైర్ 2 జనరల్ లో మార్పులు చేస్తూ గ్రాడ్యుయేట్ ట్రైనీ జీతం 25వేల పౌండ్లుగా నిర్ణయించింది.అలాగే విద్యార్థి వీసాలకు (టైర్ 4కు) కూడా భారీ మార్పులు ప్రకటించింది. దీంతోపాటు బ్రిటన్లో ఐదేళ్ల పాటు ఉండే వారికి కొత్త ఇంగ్లీషు భాష నిబంధనలు కూడా మార్చింది.
ముఖ్యంగా ఐసీటీ కేటగిరీలో 90 శాతం డిమాండ్ భారతీయ ఐటీ ఉద్యోగులదేనని బ్రిటన్ మైగ్రేషన్ ఎడ్వయిజరీ కమిటి లెక్కలు చెబుతున్నాయి. కాగా త్వరలోనే బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మన దేశంలో పర్యటించనుండగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఈ ఆదివారం ఢిల్లీ చేరనున్నారు. వలసదారులపై కొరడా ఝళిపించడానికి బ్రిటన్ సమాయత్తమవుతోందనీ, ఈ చర్యలతో భారత వలసదారులపై తీవ్ర ప్రభావం పడనుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.