పర్యటన వాయిదా..నందన్ నీలేకని రిటర్న్స్?
సాక్షి, ముంబై: అంచనాలనకునుగుణంగా పీస్ మేకర్‌గా భావిస్తున్న నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సంక్షోభాన్ని తీర్చిదిద్దేందుకు సన్నద్ధం కానున్నారు. విశాల్ సిక్కా రాజీనామాతో క్రైసిస్‌లో పడిపోయిన ఇన్ఫీని ఆదుకునేందుకు నీలేకని ఇన్ఫోసిస్ బోర్డులోకి రానున్నారనే అంచనాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన ఎంపిక కానున్నారని సమాచారం. ముఖ్యంగా నీలేకని తన రెండు నెలల అమెరికా పర్యటనను వాయిదావేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.
అలాగే ఇన్ఫోసిస్ బోర్డులో ప్రక్షాళన తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం నలుగురు బోర్డు సభ్యులకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఆర్.శేషసాయి, కో చైర్మన్ రవి వెంకటేశన్, రూపా కుద్వా, జెఫ్ లేమాన్ లకు ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాల భావన.
భారత రెండో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను గట్టెక్కించేందుకు ఆధార్ సృష్టికర్త, సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి మళ్లీ రావడంఖాయమనే తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడదు.
మరోవైపు కంపెనీ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇన్వెస్టర్లతో ఆ రోజు తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. మూర్తి అనారోగ్య కారణాలరీత్యా ఈ నెల 29కి దీన్ని వాయిదా వేశారు.
అంతేకాదు దాదాపు 12మందికి పైగా ఫండ్ మేనేజర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు మాజీ సీఈవో నందన్ నీలేకని ఇన్ఫీ బోర్డులోకి పునరాగమనాన్ని ఆకాంక్షిస్తున్నారు. సమస్య పరిష్కారానికి షేర్ హోల్డర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఆయనే సరైన వ్యక్తి అని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స ఫండ్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఒక ఉమ్మడి లేఖను ఇన్ఫోసిస్ ఛైర్మన్‌కు రాయడం గమనార్హం.
కాగ ఇన్ఫోసిస్‌ను నెలకొల్పిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నిలేకని ఒకరు. ఈయన కంపెనీకి సీఈవోగా 2002 నుంచి 2007 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆధార్ కార్డు రూపకల్పన ప్రాజెక్టు హెడ్‌గా 2009లో బాధ్యతలు స్వీకరించి ఇన్ఫీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.