ఆ ముగ్గురూ.. ద్రోహులే
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదుల నిరసన కొనసాగుతోంది. ఆయనతోపాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రధానికి లేఖ రాయడంపై... తెలంగాణపై విషం కక్కుతున్నారంటూ ఎంపీ లగడపాటిపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నారుు. ఈ ముగ్గురు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ద్రోహులనే నినాదాలతో ఓరుగల్లు మార్మోగింది. టీజేఏసీ పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా శనివారం ఆ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేశారు. జేఏసీ, టీఆర్ఎస్, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగారుు.
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్‌లో ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఉచిత వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్యం అందజేశారు. సంస్థ నిర్వాహకులు పరికిపండ్ల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నర్మెట మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాప్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని జేఏసీ కన్వీనర్ మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
భూపాలపల్లి మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఘనపురం మండలం కరకపల్లిలోని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం నిరసనకారులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
లింగాలఘనపురం, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూర్‌నాగారం, మంగపేట మండల కేంద్రా ల్లో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇప్పటికైనా సీఎం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి పక్షపాతిగా వ్యవహరిస్తున్నందున రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరిపెడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సీఎం డౌన్‌డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం ధ్వనించింది.
వుుఖ్యవుంత్రిని వెంటనే బర్తరఫ్ చేయూలనే డిమాండ్‌తో నర్సంపేటలో టీబీఎస్ఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
హన్మకొండ బస్టాండ్ సమీపంలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని టీ ఎస్‌జేఏసీ కన్వీనర్ బొల్లపల్లి కిషన్ డిమాండ్ చేశారు.
తెలంగాణపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారంటూ మహబూబాబాద్, నర్సింహులపేటలో తెలంగాణవాదులు నిరసన తెలిపారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.పద్ధతి మార్చుకోకుంటే తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు.