ఇక ఎయిర్ కండిషన్ మార్కెట్లు
వేర్వేరుగా కూరగాయలు, మాంసం మార్కెట్లు
పాత రైతు బజార్లకూ హంగులు, ఏసీ సౌకర్యం
సీఎం ఆదేశాలతో పురపాలక శాఖ చర్యలు
హైదరాబాద్: తెలంగాణలో ఎయిర్ కండిషన్ సౌకర్యంతోపాటు ఆధునిక హంగులతో కూడిన శాఖాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఒకేచోట కాకుండా వేర్వేరుగా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పాత మార్కెట్లు, రైతు బజార్లలో ఆయా సౌకర్యాలు కల్పించి ఆధునీకరించనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఏసీ సౌకర్యంతో పాటు పరిశుద్ధ, ఆరోగ్యకర వాతావరణం, సర్వ హంగులతో కూడిన కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్ల నిర్మాణం, పాత మార్కెట్ల ఆధునికీకరణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలాలను గుర్తించి 15 రోజుల్లో సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపించాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది.
పాతవాటిని ఆధునీకరించేందుకు కూడా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కూరగాయల మార్కెట్ల సంఖ్య, వాటి విస్తీర్ణం, ఆధునీకరణ కోసం ప్రతిపాదించే మార్కెట్ల సంఖ్య, కొత్తగా ప్రతిపాదించే మార్కెట్లు, కావాల్సిన నిధులు తదితర వివరాలతో నమూనా ఫార్మాట్‌ను అన్ని మునిసిపాలిటీలకు పంపించింది. రెవెన్యూ శాఖ సహాయంతో స్థలాలను గుర్తించి నిర్దేశించిన నమూనాలో మూడు సెట్ల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లకు అందజేయాలని మునిసిపల్ కమిషనర్లకు సూచించింది. మునిసిపల్ కమిషనర్లు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి నెల రోజుల్లో తమకు సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.