తెలంగాణలో 99% మంది మాంసాహారులే
అహ్మాదాబాద్ : దేశంలో మాంసాహారం తింటున్న వారిలో 99 శాతం మంది ప్రజలతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే వెల్లడించింది. పదిహేనళ్లు ఆపైన వయస్సు ఉన్నవారిని మాంసాహారాన్ని తీసుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని 98.8 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మాంసాహారాన్నే భుజిస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రెండు, మూడు, నాలుగు స్థానాలు అక్రమించాయని చెప్పింది. అలాగే శాఖహారులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది.. ఆ తర్వాత స్థానాలు పంజాబ్, హర్యానా నిలిచాయి.
సాంప్రదాయ పద్దతులకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఆహారం తీసుకుంటున్నారని... అందువల్లే వారు అగ్రస్థానంలో నిలిచారని ఆహార నిపుణులు సవ్యసాచి రాయ్‌చౌదరి వెల్లడించారు. అలాగే తెలంగాణ ప్రజలు ఉదయం పూట టిఫిన్‌గా మటన్, చికెన్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. చాలామంది కుందేళ్లు, కోలంకిపిట్టతోపాటు ఈము పక్షులను కూడా ఇష్టంగా లాగిస్తున్నారని చెప్పారు. జీవనశైలికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల మాంసం వాడకం విపరీతంగా పెరిగిందన్నారు.
హైదరాబాద్‌లో అయితే మాంసం తింటున్నవారి శాతం అత్యధికంగా ఉందని... మిగిలిన తెలంగాణ జిల్లాలో శాఖహారం తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారు. దేశంలో అత్యధిక గొర్రెలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని... అలాగే కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందన్నారు.
శాకాహారులే అధికంగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా మాంసం తీనే వారి సంఖ్య మరింత పెరిగింది. అది ఎంతగా అంటే దాదాపు 40 శాతం మేర పెరిగారు. అయితే ఈ రాష్ట్రంలో పురుషులతో సరిసమానంగా మహిళలు కూడా మాంసాహారం తింటున్నారు. గుజరాత్లో దాదాపు 1600 కి.మీ. తీరప్రాంతం ఉండగా.. 15 శాతం మంది తెగలు, 7 శాతం మంది దళితులు, 50 శాతం ఒబీసీలు, 12 శాతం మంది మైనార్టీలు ఉన్నారని సామాజిక శాస్త్రవేత్త ఘన శ్యామ్ సా వెల్లడించారు.