'అంత పనికిమాలిన సినిమా చూడలేదు'
హ్యాపీ న్యూ ఇయర్.. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా. ఇది బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టి.. ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిందని అభిషేక్ తండ్రి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం ప్రశంసించారు. కానీ.. అభిషేక్ తల్లి, అలనాటి హీరోయిన్ జయాబచ్చన్‌కు మాత్రం ఈ సినిమా ఎందుకో అస్సలు నచ్చలేదు.
ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యంత పనికిమాలిన (నాన్సెన్సికల్) సినిమా ఇదేనని ఆమె చెప్పారు. ''కేవలం అభిషేక్ అందులో ఉన్నాడు కాబట్టే ఆ సినిమా చూశాను. కెమెరా ఎదురుగా అంత చెత్తగా కూడా నటించావంటే నువ్వు చాలా గొప్ప నటుడివని కూడా వాడికి చెప్పాను'' అని జయాబచ్చన్ మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టే తాను నటించడం కూడా మానుకున్నట్లు ఆమె చెప్పారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదని, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చెప్పారు.