ఈ నెల నుంచే మళ్లీ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ నెలలోనే మ్యాగీ బ్రాండ్ నూడుల్స్ విక్రయాలు మళ్లీ ప్రారంభించనున్నట్లు నెస్లే ఇండియా తెలిపింది. తాజాగా ఉత్పత్తి చేసిన నూడుల్స్... వినియోగానికి సురక్షితమైనవేనంటూ ప్రభుత్వ ల్యాబొరేటరీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది. బోంబే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కర్ణాటక, పంజాబ్, గోవాలోని తమ ప్లాంట్లలో తయారైన నూడుల్స్‌ను ప్రభుత్వ అక్రెడిటేషన్ గల మూడు ల్యాబొరేటరీలు క్లియర్ చేశాయని నెస్లే ఇండియా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఉన్న మరో రెండు ప్లాంట్లలోనూ నూడుల్స్ తయారీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది.
ఇందుకోసం కావాల్సిన అనుమతులను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలపై విక్రయాలను ఆహారపదార్థాల నాణ్యతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.