Normal holiday
-
ఏప్రిల్ 11న సార్వత్రిక సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 11ను సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని తెలిపింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్‌కు ముందు రోజు ఏప్రిల్ 10తో పాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న మే 23న అవసరమైతే స్థానిక సెలవును ప్రకటించాలని కలెక్టర్లను కోరింది. ఏప్రిల్ 11న పోలింగ్ రోజు పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలు జరగని బయటి ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తప్పుల తడకగా ‘సెలవు’ జీవో
సర్వే పురస్కరించుకొని ఉత్తర్వులు ఒకే అంశంపై మూడు జీవోలు-అందులోనూ లోపాలు అయినా వర్తించని వేతనంతో కూడిన సెలవుదినం సాక్షి,సిటీబ్యూరోః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఈనెల 19వ తేదిన ప్రైవేటు కార్మికులకు ‘సాధారణ సెలవుదినం’గా ప్రకటిస్తూ ప్రభుత్వం(కార్మిక శాఖ) జారీ చేసిన ఉత్తర్వులు తప్పులతడకగా మారాయి. కార్మికుల సాధారణ సెలవు అంశంపై మూడు జీవోలు జారీ చేసినా అవి లోపభూయిష్టంగా ఉన్నాయి. ఒక తప్పు దిద్దుకొని మరో తప్పుతో లేని యాక్ట్‌లతో జీవోలు జారీ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయినా కార్మికుల వేతనంతో కూడిన సెలవు దినం అమలుపై కచ్చితమైన ఆదేశాలు లేకపోవడం విశేషం తప్పులు ఇలా.. సమగ్ర కుటుంబ సర్వే పురస్కరించుకొని తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2014 కింద తెలంగాణ ప్రాంతంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈనెల 19వ తేదీ సాధరణ సెలవుదినంగా ప్రకటిస్తూ జీవో నంబర్ 75 ద్వారా ప్రభుత్వ(కార్మికశాఖ) కార్యదర్శి ఆర్.వి.రవిచంద్రన్ ఈ నెల 12(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా కార్మిక శాఖకు సంబంధించి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2014 అనేది అసలు లేదు. మరోవైపు జీవోలో ఫ్యాక్టరీస్‌కు సంబంధించిన ఊసే ఎత్తలేదు. ఈ పొరపాటును సరిదిద్దుకునేందుకు మరుసటి రోజు(13వ తేదీ) హడావుడిగా జీవో 75ను రద్దు చేస్తూ రివైజ్డ్ జీవో నంబర్ 76ను జారీ చేశారు. ఇందులో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కింద సాధారణ సెలవుగా ప్రకటించారు. ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్ జీవో నంబర్లో తప్పు ఉండడంతో దానిని సైతం రద్దు చేస్తూ అదేరోజు తిరిగి మరో జీవోను 77 నంబరుతో జారీ చేశారు. ఇందులో తెలంగాణ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1988, ఏపీ ఫ్యాక్టరీస్ ఆండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ (జాతీయ పండుగలు అండ్ ఇతర సెలవులు) యాక్ట్ 1974 కింద సెలవు దినంగా ప్రకటించారు. ప్రజల అవసరాలు దృష్ట్యా సెలవు దినంగా ప్రకటిస్తున్న కారణంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం కేవలం సాధారణ సెలవు దినంగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 19వ తేదీన తప్పని సరిగా సెలవుగా గుర్తించే పరిస్థితి లేదు. ఒకవేళ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఫ్యాక్టరీలు సెలవుదినం అమలును విస్మరిస్తే కార్మికులు ఒక రోజు వేతనాన్ని నష్టపోక తప్పదు. మరోవైపు లోప భూయిష్టమైన జీవోతో కార్మిక శాఖ కూడా చర్య తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.