North Bay of Bengal
-
18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంనుంచి సగటున 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈనెల 20 నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో ఇప్పటివరకు అంతంతే.. ఆగస్టు నెలలో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన మేర కురవలేదు. గత నెలలో సాధారణం కంటే అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 47.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 58.37 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం కంటే 23 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 63%అధికం నుంచి ప్రస్తుతం 23% అధికం వద్ద గణాంకాలు స్థిరపడ్డాయి. ఈ నెల మూడో వారం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని, ఆగస్టు చివరి వారంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలను విడుదల చేసింది. 18న ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
23 నుంచి జోరుగా వానలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆదివారం సాయంత్రానికి బలహీనపడే సూచనలున్నాయి. అలాగే ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. రైతులు వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంపై ఆదివారం నుంచి బ్రేక్ మాన్సూన్ ప్రభావం మొదలవుతుందని, దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో మెలమెల్లగా వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి జోరందుకుంటాయని వివరించారు. -
కోస్తాంధ్ర, తెలంగాణలో అతిభారీ వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలుప్రాంతాలు.. ములకలపల్లిలో 17 సెం.మీ, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11.8, బయ్యారంలో 10.9 సెం.మీ నమోదైన వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లిలో 13 సెం.మీ, గోవిందరావుపేట 13 సెం.మీ, వెంకటాపూర్ 12.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో 3.6 సెం.మీ, విజయనగరంలో 3.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 2.3 సెం.మీ, కృష్ణా జిల్లాలో 2.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి బుధవారం ఉదయానికి గా మారింది. తొలుత అంచనా వేసినట్టుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో కాకుండా, ఏర్పడడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా బలపడి వచ్చే 24 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలమైన అల్పపీడనంగా మారవచ్చని దీని ప్రభావం.. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో కొంతవరకు ప్రభావం చూపవచ్చని వాతావరణం నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో తిరుపతిలో 6, పాలసముద్రంలో 5, తనకల్లో 4, రుద్రవరం, చిన్నమాడెం, జమ్మలమడుగు, ఆలూరుల్లో 3, పెనుకొండ, రాజంపేట, పుత్తూరు, పుల్లంపేట, కంబదూరు, పలమనేరు, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పాడేరుల్లో రెండేసి సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
వర్షం.. హర్షం..
- విశాఖలో 4.4 సెం.మీల వర్షపాతం - జిల్లాలోనూ పలుచోట్ల వాన సాక్షి, విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత వరుణుడు కరుణించాడు. అనుకోని అతిథిలా వచ్చి వర్షం కురిపించాడు. కొన్నాళ్లుగా ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చాడు. అటు అన్నదాతల్లోనూ ఆనందాన్ని పంచాడు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన మూడు రోజుల క్రితం నుంచి వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అయితే ఆకాశం మేఘావృతమై చల్లదనం పంచిందే తప్ప చెప్పుకోదగినట్టుగా వాన కురవలేదు. శనివారం ఉదయం మాత్రం విశాఖలోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఆదివారం సాయంత్రం అనూహ్యంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఇటు విశాఖనగరంతో పాటు మధురవాడ, భీమిలి, గాజువాక, అటు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విశాఖ విమానాశ్రయంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షంతో పాటు కొన్నిచోట్ల గాలులు కూడా వీచాయి. కొద్దిరోజులుగా మండే ఎండలతో వేగిపోతున్న జనానికి ఈ వాన కొండంత ఊరటనిచ్చింది. అలాగే రైతుల్లోన్లూ ఆశలు చిగురింపజేసింది. పగటి పూట ఎండలు కాసినా సాయంత్రమయ్యే సరికి అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఇలాంటి వర్షాలను కురిపిస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని సోమవారం రాత్రి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయానికి బలపడి అల్పపీడనంగా మారిందని, భూ ఉపరితలంపైనే అది కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉండడంతో దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలులే తప్ప భారీ వర్షాలకు అవకాశం తక్కువేనన్నారు. అయితే, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని కారణంగా రాష్ట్రంలో రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, దక్షిణ కోస్తా పరిధిలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.