సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని సోమవారం రాత్రి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం ఉదయానికి బలపడి అల్పపీడనంగా మారిందని, భూ ఉపరితలంపైనే అది కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉండడంతో దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలులే తప్ప భారీ వర్షాలకు అవకాశం తక్కువేనన్నారు. అయితే, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని కారణంగా రాష్ట్రంలో రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, దక్షిణ కోస్తా పరిధిలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.