
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంనుంచి సగటున 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈనెల 20 నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెలలో ఇప్పటివరకు అంతంతే..
ఆగస్టు నెలలో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన మేర కురవలేదు. గత నెలలో సాధారణం కంటే అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 47.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 58.37 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం కంటే 23 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 63%అధికం నుంచి ప్రస్తుతం 23% అధికం వద్ద గణాంకాలు స్థిరపడ్డాయి.
ఈ నెల మూడో వారం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని, ఆగస్టు చివరి వారంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలను విడుదల చేసింది. 18న ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment