నేడు మల్లన్న ఉత్తర ద్వార దర్శనం
- క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పూజలు
- సుప్రభాత, మహామంగళహారతిసేవలు తాత్కాలికంగా రద్దు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం ప్రకటించారు. ఆదివారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు జరిగే విశేషపూజల అనంతరం 5గంటలకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరముఖంగా వేంచేయించి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారన్నారు. ఉత్తర గోపుర పునఃనిర్మాణ పనుల కారణంగా ఈ ఏడాది ఆలయ మహాద్వారం శ్రీకృష్ణదేవరాయ గోపురం ద్వారా గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 నుంచి భక్తులకు మల్లన్న సర్వదర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
ఏకాదశిన ఆలయపూజావేళ్లలో మార్పులు..
ముక్కొటి ఏకాదశిని దృష్టిలో ఉంచుకుని ఆలయపూజావేళ్లలో మార్పులు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఆదివారం ఉదయం 3గంటలకు మంగళవాయిద్యాలు, 3.30గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు మహామంగళహారతి, ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రావణవాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు.