ఢిల్లీలో మణిపూర్ యువకుడికి కత్తిపోట్లు, దోపిడీ
దేశ రాజధాని నగరంలో ఈశాన్య ప్రాంతాల వారిపై దాడులు ఆగడంలేదు. మంగళవారం నాడు మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిని పొడిచి, అతడిని దోచుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఇది జాత్యహంకార దాడి కాదని అంటున్నారు. ఖుప్సియాంగెన్ (22) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మెహరౌలిలోని ఓ చర్చికి వెళ్లి అక్కడినుంచి పర్యావరణ్ కాంప్లెక్సులోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్నాడనగా అతడిపై ఈ దాడి జరిగింది. కేవలం అతడిని దోచుకోడానికే ఈ దాడి చేశారని డీసీపీ బీఎస్ జైస్వాల్ తెలిపారు. గడిచిన 15 రోజుల్లో ఈశాన్య ప్రాంతాల వారిపై దాడి జరగడం ఇది మూడోసారి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నిడో తానియా అనే యువకుడిపై దాడి జరగడంతో అతడు జనవరి 30న మరణించాడు. ఆదివారం నాడు మణిపూర్‌కు చెందిన ఇద్దరు యువకులను కొందరు మోటార్ సైకిళ్లపై వచ్చి కొట్టారు.
మంగళవారం నాటి సంఘటనలో ఖుప్సియాంగెన్ వద్ద నుంచి అతడి మొబైల్ ఫోన్, పర్సును ఐదుగురు వ్యక్తులు కత్తులు చూపించి దోచుకున్నారు. అతడి కడుపులో సెంటీమీటరు లోతులో కత్తిపోట్లు ఉన్నాయని డీసీపీ చెప్పారు. అతడిని సాకేత్ సిటీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. నాలుగేళ్లుగా ఢిల్లీలో ఓ స్నేహితుడితో కలిసి ఉంటున్న ఆ యువకుడు అనాథ అని, ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడని తెలిపారు.