Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది.
ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి.
ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది.
శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్