రైతులూ.. అధైర్యపడొద్దు
– 65వేల హెక్టార్లలో ఎండిన మొక్కజొన్న పంట
– క్షేత్రస్థాయి పరిశీలనలో జేడీఏ బాలునాయక్
ఆమనగల్లు : వర్షాభావంతో పంటలు ఎండిపోయాయని, రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని జేడీఏ బాలునాయక్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపల్లిలో ఎండిన మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో సరైన వర్షాలు కురియకపోవడంతో కొన్ని మండలాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. జిల్లావ్యాప్తంగా 65వేల హెక్టార్లలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు. ఎండిన పంటల వివరాలు సేకరిస్తున్నామని, బాధిత రైతులకు తప్పక పరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఏ రఘురాములు, ఏడీఏ శ్రీనివాసరాజు, ఏఓ అరుణకుమారి, ఏఈఓ శివయ్య తదితరులు పాల్గొన్నారు.