దేవయాని కూతుళ్లు భారత పౌరులు కాదు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి దేవయాని ఖోబ్రగడే ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది. తన ఇద్దరు కూతుళ్ల భారతీయ పాస్‌పోర్టులను పునరుద్ధరించాలంటూ దేవయాని వేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ విచారించారు.
ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కూతుళ్లకు సంబంధించిన పాస్‌పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని కొద్ది నెలల క్రితం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడం విచారణను మార్చి 30వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్‌పోర్టులను రద్దు చేసింది.