కొబ్బరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కురసాల కన్నబాబు
ముమ్మిడివరం : తీవ్రంగా నష్టపోయిన కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 4వ వార్డులో బుధవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కొబ్బరిధర పతనమై రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా సీఎం చంద్రబాబునాయుడు గోదావరి, కృష్ణా పుష్కరాలపై ప్రచార ఆర్భాటం చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలో 56వేల ఎకరాలలో రైతులు పంట విరామం ప్రకటించినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వ్యవసాయశాఖ మంత్రిని ఈ ప్రాంతానికి పంపించి పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. నాఫెడ్ కేంద్రాల ద్వారా కేవలం రూ.15 కోట్ల ఎండు కొబ్బరిని కొనుగోలు చేసిందని, రైతులకు ఇంకా రూ.7కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. గత నెల 8న ప్రారంభించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి రామారావు(బాబీ), నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ తదితరులున్నారు.
సత్యనారాయణచౌదరికి పరామర్శ
రాయవరం : మాతృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ నేత రిమ్మలపూడి వీరవెంకటసత్యనారాయణచౌదరి(సత్తిబాబు)ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం పరామర్శించారు. సత్తిబాబు తల్లి లక్ష్మీకాంతం ఈనెల 17న కన్నుమూశారు. సత్తిబాబు, ఆయన సోదరుడు సుబ్బారావుచౌదరిలను కన్నబాబు పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సత్యనారాయణచౌదరిని ఫో¯Œ లో పరామర్శించి సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిందిగుదిటిమోహన్, గుత్తులసాయి, పార్టీ ప్రచార సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు.