‘దుబ్బాక’లో ఒక ఓటు గల్లంతు!
దుబ్బాక,న్యూస్‌లైన్: దుబ్బాక నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన పొలింగ్‌లో శాసనసభ అభ్యర్థికి, లోక్‌సభ అభ్యర్థికి సమానంగా ఓట్లు పోలు కాలేదు. ఈవీఎం పద్ధతి అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌కు, శాసనసభకు సమానంగా ఓట్లు పోలవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గంలో శాసనసభకు పొలైన ఓట్ల కంటే లోక్‌సభకు ఒక ఓటు తక్కువగా పోలవడం విచిత్రం. అభ్యర్థులు ఓటరుకు నచ్చని పక్షంలో నోటా అవకాశం ఉంది. అయినప్పటికీ దుబ్బాకలో ఒక ఓటు శాసనసభకు వేసి, మరో ఓటు లోక్‌సభ అభ్యర్థికి వేయకపోవడం అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు.
ఆ ఓటు వినియోగించుకోనిది కూడా ఓ మహిళ ఓటరు కావడం విశేషం. నియోజకవర్గంలో మొత్తం 1,86,445 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 94,165 మంది, పురుషులు 92,273 మంది, ఇతరులు 07 ఓటర్లున్నారు. ఇందులో నియోజకవర్గంలో పొలైన ఓట్లలో 77,407 మంది మహిళలు, 76,450 మంది పురుషులు మొత్తం 1,53,857 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శాసనసభకు 1,53,857 ఓట్లు పోల్ కాగా...పార్లమెంట్‌కు 1,53,856 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని దుబ్బాక పట్టణంలోని 34వ పొలింగ్ కేంద్రంలో ఒక మహిళ శాసన సభకు ఓటు వేసి, లోక్‌సభ అభ్యర్థికి ఓటు వరేయలేదని అధికారులు తెలిపారు.
దుబ్బాకలోని 34వ పొలింగ్ కేంద్రంలో 1023 మంది ఓటర్లున్నారు. ఇందులో 529 మంది మహిళా ఓటర్లు, 494 మంది పురుషులు ఉన్నారు. ఈ పొలింగ్ కేంద్రంలో 1023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీరిలో 369 మంది పురుషులు, 415 మంది మహిళలు శాసన సభ అభ్యర్థులకు ఓటు వేశారు. ఇకపోతే లోక్‌సభ అభ్యర్థులకు 369 మంది పురుషులు ఓటు వేశారు. 414 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు. వీరిలో ఒక మహిళ ఓటు తక్కువగా నమోదైంది. ఇలా చాల అరుదుగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఓటరుకు అభ్యర్థి నచ్చకుంటే నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థికి ఒక ఓటు త క్కువగా నమోదు కావడం చర్చనీయంశంగా మారింది. పొలింగ్ కేంద్రంలో మొదట లోక్‌సభకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఆనంతరం శాసనసభకు ఓటు వేయాలి. మరి ఈ పొలింగ్కేంద్రంలో మొదట పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థికి ఓటు వేయకుండా నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసి వెళ్లిపోయి ఉండవచ్చని అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఓటు ఏ అభ్యర్థికి పడేదో కాని, ఆ అభ్యర్థి ఒక ఓటును నష్టపోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.