అనధికార క్రయవిక్రయాల క్రమబద్ధీకరణ
నోటరీలు, తెల్లకాగితాలపై అమ్మకాలకు రిజిస్ట్రేషన్
ఆదాయ ఆర్జనపై దృష్టి పెట్టిన టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: నోటరీలు, తెల్లకాగితాలపై చేసుకున్న క్రయవిక్రయాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీతోపాటు, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భూ రికార్డులకు సంబంధించి సమస్యలు ఉండడంతో... ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోందని ప్రభుత్వం గుర్తించింది.
పాతబస్తీలో అనధికారికంగా జరిగే విక్రయాలను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదా యం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఆదాయార్జనపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా లొసుగుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ కోల్పోతున్న ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
విలువ ఆధారిత పన్ను వసూళ్లలో ఈసారి కూడా 25 శాతం వృద్ధి సాధించాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వద్ద జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఆన్లైన్ అమ్మకాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. రవాణా వాహనాలకు 3 నెలలకోమారు మోటారు వాహనాల పన్ను వసూలు చేస్తు న్నా.. ఆ ఆదాయం తగ్గుతోందని గుర్తించారు. భూగర్భ ఖని జాలు, గనుల ఆదాయం తగ్గకుండా చూసుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రావాళ్లు వృత్తిపన్ను చెల్లిస్తున్నారా?
హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చెల్లిస్తున్న వృత్తిపన్నును ఏపీ ప్రభుత్వం ఇక్కడ జమ చేస్తున్నదో లేదో తెలుసుకోవాలని టీ సర్కార్ సంబంధిత అధికారులను కోరింది. చెల్లించకుంటే ఆ మొత్తం రాబట్టాలని సూచించింది.