నోటీసుల భయం
అధిక డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ ఆరా
బెంబేలెత్తుతున్న బడా బాబులు
ఇతరుల ఖాతాలను ఉపయోగించేందుకు వెనుకంజ
తిరుపతి: పెద్ద నోట్ల రద్దు తరువాత అధిక మొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఖాతాదారులను నోటీసుల భయం వెంటాడుతోంది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వీరు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. బంధువులు, పరిచయస్తుల నగదును తమ ఖాతాల్లో వేసుకునేందుకు సైతం జిల్లా వ్యాప్తంగా జనం వెనుకంజ వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మొదట్లో పన్ను ఎగవేతదారులను, ఇప్పుడు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారినీ బెంబేలెత్తిస్తోంది. ఈ నెల 8న నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోగానే మరుసటి రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు వేగం పుంజుకున్నారుు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ సుమా రు రూ.600 కోట్లకు పైగానే డిపాజిట్లు జరిగాయని జిల్లాకు చెందిన బ్యాంకర్లు చెబుతున్నారు. నల్లధనం కలిగిన ఎంతో మంది పన్ను ఎగువేతదారులు తమకు పరిచయమున్న వారి ఖాతాల్లోనూ, నమ్మకస్తులైన వారి ఖాతాల్లోనూ నగదు డిపాజిట్ చేశారు.
తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు ప్రాంతాల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారని వినికిడి. వీరితో పాటు వడ్డీ వ్యాపారులు, రాజకీయ నేపథ్యం ఉన్న బడాబాబులు లక్షలాది రూపాయల డబ్బును ఇతరుల ఖాతాలకు మళ్లించారని సమాచారం. జిల్లాలో 72 శాఖలను కలిగిన ఎస్బీఐలో సుమారు 2 వేల ఖాతాల్లోనూ, జిల్లాలో అత్యధిక శాఖలను కలిగిన సప్తగిరి గ్రామీణ బ్యాంకులోనూ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ ఇతరత్రా వాణిజ్య బ్యాంకుల్లో మరో వెరుు్య ఖాతాల్లోనూ రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు జమ జరిగినట్లు సమాచారం. తమ డబ్బును మీ ఖాతాలో సర్దుబాటు చేస్తే ఎంతో కొంత ముట్టజెబుతామని కొంతమంది పన్ను ఎగవేతదారులు పేద మధ్య తరగతి వాళ్లను అక్కడక్కడా ఒప్పించి వారి నగదును వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా ఎంతో మంది అవగాహన లేనివారు ఈ మధ్య తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లోనూ నగదు డిపాజిట్ చేస్తున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఈ ఖాతాల్లో ఉండకూడదన్న నిబంధన విస్మరించి పలువురు డిపాజిట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఇబ్బందులు కొని తెస్తాయన్న విషయం తెలియక చాలామంది తొందరపడి ఇతరుల నగదును సొంత ఖాతాల్లో వేసుకుంటున్నారు.
దృష్టి సారిస్తున్న ఆదాయపు పన్నుల శాఖ
ఆదాయపు పన్నుల అధికారులు అధిక డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ తరహా ఖాతాలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వారం రోజుల్లో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ అరుున ఖాతాలను గుర్తించి వారికి నోటీసులు పంపి డిపాజిట్ చేసిన సొమ్ము తాలూకు డాక్యుమెం ట్లను పరిశీలించే పనిలో పడింది.
సోషల్ మీడియా ద్వారా విషయం తెల్సుకున్న జిల్లా డిపాజిటర్లు కలవరపాటుకు గురవుతున్నారు. మొబైల్ ఏటీఎంల ద్వారా చాలా మంది నగదు విత్‌డ్రా చేయడం ప్రారంభించారు. దీనివల్లనైనా తమ ఖాతాల్లో నగదు తక్కువగా కనిపిస్తుందని వీరి భావన. శనివారం ఆదాయపు పన్నుల శాఖకు సెలవు దినం కావడంతో సోమవారం నుంచి ఆయా శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టే వీలుందని తెలుస్తోంది.