'ఫిరాయింపు' ఎమ్మెల్యేలపై స్పీకర్ స్పందన
కరీంనగర్: పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో చాలాకాలం తరువాత శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో హైకోర్టు నోటీసులు తనకింకా అందలేదని, అందిన తర్వాతే స్పందిస్తానని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందన్న సమాచారం మీడియా ద్వారా తెలిసిందని, వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు అందుకోలేదన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజీనామా లేఖపై విలేకరులు అడిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఈ వ్యవహారంలో లేనిపోని విమర్శలు చేస్తున్న వారి అడ్రస్‌లు ఇప్పటికే గల్లంతయ్యాయని, రానున్న రోజుల్లో శాశ్వతంగా గల్లంతవుతాయని పరోక్షంగా విపక్షాలను ఉద్దేశించి అన్నారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాలు జరిగిన సందర్భంలో తెలంగాణపై వివక్ష ప్రదర్శించారని, ప్రస్తుతం స్వరాష్ట్రంలో జరుగుతున్న పుష్కరవేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని, ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణవైపే చూస్తున్నదన్నారు.