కొలువుల భర్తీ అరకొరే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సోమవారం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఏడెనిమిదేళ్లుగా ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అరకొరగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరాశనే మిగిల్చింది. జిల్లాలో 724 క్లస్టర్ పంచాయతీల్లో 300 క్లస్టర్లలో మాత్రమే కార్యదర్శులున్నారు. మిగిలిన 424 క్లస్టర్లలో బిల్లు కలెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లే కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడుతోందంటే నిరుద్యోగులంతా ఎంతో సంతోషించారు. తీరా నోటిఫికేషన్ వెలువడి జిల్లాలో భర్తీచేసే పోస్టుల లెక్క తేలేసరికి ఉసూరుమంటున్నారు. జిల్లాలో ఉన్న కార్యదర్శుల ఖాళీలకు, ఇప్పుడు భర్తీ చేసే పోస్టుల సంఖ్యకు భారీవ్యత్యాసం ఉండటంతో నిరాశ చెందుతున్నారు.
అయిదింట ఒక వంతే..
గత నెలలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ రకంగా భర్తీచేసే పోస్టులు 68 వరకు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న 62 మంది కార్యదర్శులకు పోస్టులు ఇచ్చే కసరత్తు జరుగుతోంది. మిగిలిన ఆరు పోస్టులకు 13,400 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద ఆ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ అయ్యే 68 పోస్టులను మినహాయిస్తే మరో 356పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సోమవారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,200 పోస్టులను భర్తీ చేయనుండగా వాటిలో జిల్లాకు 70 పోస్టులు మాత్రమేవస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరో 286 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి.
అంటే పోస్టుల్లో అయిదింట ఒక వంతు మాత్రమే భర్తీ చేస్తున్నారన్న మాట.
ఎంపికలో కొత్త విధానానికి నిరసన కాగా ఈ పోస్టుల భర్తీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను వర్తింపచేయనున్నారు. మొత్తం 70 పోస్టుల్లో బీసీలకు 15, ఎస్సీలకు 30, ఎస్టీలకు నాలుగు, ఓసీలకు 21 కేటాయించే అవకాశం ఉందని అధికారుల అంచనా. 33 శాతం రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 23 పోస్టులు కేటాయించనున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ ప్రకారం కార్యదర్శుల పోస్టులకు ఫిబ్రవరి నెలలో రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలను ఖరారు చేయనున్నారు. అరకొరగా పోస్టులను భర్తీ చేయనుండడమే కాక ఈ కొత్త విధానాన్ని అమలు చేయడమేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.