ఇక అంతా మాజీలే..!
నిధులిచ్చే అధికారం లేదు
కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు
చంద్రబాబు, కిరణ్ సహా మాజీలే
సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలంతా దాదాపుగా మాజీలయ్యారు. ఏప్రిల్ 12వ తేదీ సీమాం ధ్రలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు వీరి పదవీకాలం ఉన్నప్పటికీ ఆచరణలో ఎలాంటి అధికారాలు, సౌలభ్యాలు, హోదా ఉండదు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ మాజీలు గా మారారు. ఇకపై వీరు అధికారులతో ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించేం దుకు వీలులేదు.
తిరుపతి, చిత్తూరు, రాజం పేట ఎంపీలు చింతామోహన్, ఎన్.శివప్రసాద్, సాయిప్రతాప్ కూడా మాజీలైనట్టే. ఐదేళ్ల పాటు ప్రజాప్రతినిధులుగా అధికారులపై అజమాయిషీ చెలాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకనెల పాటు పదవిలో ఉన్నా డమ్మీలే. వీరికి ప్రోటోకాల్ మర్యాదలు వర్తించవు. వ్యక్తిగత భద్రతకు అవసరమైన గన్మెన్లు మాత్రం ఉంటారు. నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఇతర అభ్యర్థులతో సమానంగానే వీరిని పరిగణిస్తారు. వీరికి ఎలాంటి ప్రత్యేక హోదా, మర్యాదలు ఉండవు. జిల్లాలో ఇది వరకే పలమనేరు, తంబళ్లపల్లె, పుంగనూరు ఎమ్మెల్యేలు మాజీ లుగా మారారు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాజీలైనట్టే.
ఎమ్మెల్యే, ఎంపీ గ్రాంట్లకు బ్రేక్
తాత్కాలికంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవిలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అధికారం ఉండదు. ఒకవేళ షెడ్యూల్డ్ తేదీకి ముందే శాంక్షన్ లెటర్లు అధికారులకు పంపి ఉన్నా, ఆ పనులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాతే ప్రారంభించాల్సి ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పనులు చేపట్టేందుకు వీలులేదు. కొత్తగా స్కీంలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్‌తో నిషేధం అమల్లోకి వచ్చినట్లే. ముఖ్యప్రణాళిక అధికారి కార్యాలయం ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే గ్రాంట్స్ విడుదలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజాప్రతినిధుల గ్రాంట్స్‌తో చేపట్టే పనులు ఎలాంటివైనా ప్రారంభించరాదని ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో శాంక్షన్ లెటర్ ఇచ్చి ఉన్నా, ఇప్పుడు పని ప్రారంభించరాదని ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాతే చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అతిథి గృహాల ను, వాహనాలను ఇతర సౌకర్యాలను ప్రత్యేకంగా పొందేందుకు వీలులేదు. ఒకవేళ సేవలు వినియోగించుకున్నా అందుకు అవసరమైన రుసుం చెల్లించాలి.
సభల నిర్వహణకు అవసరమైన మైదానాలు, ఇతర పబ్లిక్ స్థలాలను ప్రజాప్రతినిధులతో పాటు, ఎన్నికల్లో పాల్గొనే ఇతర అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నేతలకు నిర్ణీత రుసుం వసూలు చేసి అనుమతి ఇవ్వాలని కోడ్‌లో పేర్కొన్నారు.
అధికారులు ఏ ఒక్క ప్రజాప్రతినిధికో, రాజకీయ నాయకుడికో అనుకూలంగా వ్యవహరించకూడదు.
అధికారికంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదు.