మళ్లీ క్యాంపులకు...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘స్థానిక’ సంస్థల సారథుల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎక్స్అఫీషియోల అంశం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు జెడ్పీ, మండల పరిషత్లు, పురపాలక సంఘాల చైర్మన్ల ఎన్నికపై స్పష్టత రాలేదు. ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణస్వీకారం ప్రక్రియ ముగియడం.. మరోవైపు శాసనసభ సమావేశాలు సైతం ముగియడంతో ప్రభుత్వం స్థానిక సంస్థల పాలక వర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగిరం చేసింది. ఇందులో భాగంగా మరో వారం, పది రోజుల్లో పరిషత్, పురపాలక సంఘాల అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో మేజిక్ ఫిగర్ కోసం ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు.. తాజాగా దూకుడు పెంచారు. దీంతో ‘స్థానిక’ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ప్రతినిధులూ.. చలోచలో..
స్థానిక సంస్థల ఎన్నికలు గత ఏప్రిల్ నెలలో రెండు దఫాలుగా జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు మార్చి చివర్లో పూర్తయ్యాయి. జిల్లా పరిషత్, 33 మండల పరిషత్లతో పాటు ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్, వికారాబాద్, తాండూరు, బడంగ్పేట్ మున్సిపాలిటీలకు సంబంధించిఏప్రిల్ 12, 13 తేదీల్లో ఫలితాలు ప్రకటించారు. అయితే ఫలితాల అనంతరం వారం రోజుల్లో పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉండగా.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక వాయిదాపడింది. ఎక్స్అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో అప్పట్నుంచి వాయిదాపడ్డ ఎన్నికలకు తాజాగా మార్గం సుగమమైంది.
ఈనేపథ్యంలో ఆశావహులు స్థానిక ఫలితాలు వెలువడిన నాటినుంచే ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి ‘మేజిక్ అంకె’ మెజార్టీ కోసం ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. అయితే ఎన్నిక అంశం ఆలస్యమవుతుండడంతో పలు మండలాల్లో క్యాంపు రాజకీయాలు క్రమంగా బలహీనమయ్యాయి. దీంతో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తిన్నగా ఇంటిబాట పట్టారు. తాజాగా ఎన్నిక ప్రక్రియపై అధికారవర్గాల్లో చలనం రావడంతో మళ్లీ క్యాంపులు ఊపందుకున్నాయి.
ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో రెండో విడత క్యాంపులకు తెరలేచింది. అదేవిధంగా యాచారం మండలంలోని సభ్యులు.. ఇరు వర్గాలు తలపెట్టిన క్యాంపుల్లో బిజీ అయ్యారు. అదేవిధంగా చేవెళ్ల, వికారాబాద్, పరిగి, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న పార్టీలు సైతం మళ్ళీ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నాయి. మర్పల్లిలో ఒక విడత క్యాంపులోకి వెళ్లి తిరిగొచ్చిన సభ్యులు.. మళ్ళీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే క్యాంపు బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు.
వారం రోజుల వ్యవధిలో.. కొత్తపాలక వర్గాలు
‘స్థానిక’ సారధుల నోటిఫికేషన్ ఈ నెల చివరివారంలో వెలువడనున్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకటన వెలువడిన అనంతరం ప్రకటనలో పేర్కొన్న గడువులోగా బలాబలాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. నిర్దిష్ట తేదీ లోగా బలాన్ని ప్రదర్శించిన వారిని ‘అధ్యక్ష’ పీఠం వరించనుంది. ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గాం ఏర్పాటు కానుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి వారం రోజు ల్లోనే కొత్త పాలక వర్గాలు కొలువుదీరే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.