లుపిన్ చేతికి అమెరికా కంపెనీ
గవిస్ కొనుగోలుకు ఒప్పందం
♦ డీల్ విలువ రూ. 5,610 కోట్లు
న్యూఢిల్లీ : ఔషధాల తయారీ దిగ్గజం లుపిన్ తాజాగా అమెరికాకు చెందిన గవిస్ ఫార్మా..నోవెల్ ల్యాబ్స్ (గవిస్) సంస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం సుమారు రూ. 5,610 కోట్లు (880 మిలియన్ డాలర్లు) వెచ్చించనున్నట్లు లుపిన్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఇరు సంస్థల బోర్డులు ఆమోదించినట్లు పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని లుపిన్ సీఈవో వినీతా గుప్తా తెలిపారు. దీనితో తమ డెర్మటాలజీ ఉత్పత్తుల శ్రేణి మరింత పెరగగలదని ఆమె పేర్కొన్నారు.
న్యూజెర్సీలోని గవిస్ తయారీ కేంద్రం.. అమెరికాలో తమ మొట్టమొదటి తయారీ కేంద్రం అవుతుందని గుప్తా వివరించారు. అమెరికాలో స్పెషాలిటీ ఔషధాలకు సంబంధించి ఇరు కంపెనీల భాగస్వామ్యం కీలకంగా మారగలదని ఆశిస్తున్నట్లు గవిస్ వ్యవస్థాపకుడు వీరప్పన్ సుబ్రమణ్యన్ తెలిపారు. గవిస్ ప్రస్తుతం ఫార్ములేషన్ల అభివృద్ధి, తయారీ, ప్యాకేజింగ్, అమ్మకాలను నిర్వహిస్తోంది. గవిస్ కొనుగోలుతో లుపిన్కు మరో 66 జనరిక్ ఔషధాలు అందుబాటులోకి వస్తాయి.