తస్మదీయులా..లేపెయ్యండి పేర్లు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పవిత్రమైదని, అర్హులైన ప్రతివారూ ఓటు నమోదు చేయించుకోవాలని ఎన్నికల సంఘం పదేపదే ప్రకటనలు చేస్తోంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, సిబ్బంది అర్హులందరినీ జాబితాలోకి ఎక్కించేందుకు కృషి చేయాల్సి ఉంది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికే ఓటర్లుగా నమోదై, జాబితాల్లో ఉన్న వారి పేర్లను మూకుమ్మడిగా తొలగించే కుతంత్రం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు కాక ప్రత్యర్థి పక్షాలకు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అనుమానం ఉన్న వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకుడొకరు అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
ఓడిపోతానన్న భయం పీడిస్తున్న ఆ నేత అడ్డదారుల్లోనైనా గెలుపు బాట వేసుకోవడానికి బరి తెగిస్తున్నారని, నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా మున్సిపల్ పరిధిలో మొత్తం సుమారు 20 వేల మంది తస్మదీయుల (తమకు చెందని వారు) ఓట్లను తొలగించాలని ఆయా మండల తహశీల్దార్లను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని తమ కార్యకర్తలతో తయారు చేయించిన ‘తొలగింపు’ జాబితాలను తహశీల్దార్లకు అందించగా.. వారు వాటిని సంబంధిత జాబితాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందించినట్టు తెలుస్తోంది. సదరు నేత ఆదేశాలను తలదాల్చిన ఓ తహశీల్దార్ ‘ఫారం-7(మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, వివాహమై అత్తింటికి వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు నిర్దేశించినది)లు ఎన్ని వచ్చాయి? మీకిచ్చిన ‘తొలగింపు’ జాబితాలను ఏం చేశారు?’ అంటూ బీఎల్ఓలను ఒత్తిడి చేస్తున్నారు.
అధికార పార్టీ నేత కుటిల వ్యూహం నేపథ్యంలోఏ బూత్‌లో ఎవరి ఓటు గల్లంతవుతుందోనన్న ఆందోళన నియోజకవర్గంలోని ఓటర్లను పీడిస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లలో అత్యధికులు.. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల వారు ైవె ఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉంటున్నారు. దీంతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని కలవరపడుతున్న అధికార పార్టీ నేత ఇప్పటి నుంచే పథకం ప్రకారం అలాంటి ఓట్ల తొలగింపునకు పూనుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని జాబితాలను తయారు చేయించి మండల స్థాయిలో ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లకు అందించారు. ఇలాంటి జాబితాల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ ఓటర్ల పేర్లు ఉండటం గమనార్హం. చనిపోయిన వారి పేర్లతో పాటు పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లతోనూ ఫారం-7లు నింపిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా ఓట్ల తొలగింపునకు ముందస్తుగా ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి. అనంతరం గ్రామ సభలను ఏర్పాటు చేసి ఓట్లను తొలగించాలి. కానీ కొన్ని గ్రామాల్లో నోటీసులు కూడా లేకుండానే ఓట్లను తొలగిస్తున ్నట్లు ఓటర్లు గ గ్గోలు పెడుతున్నారు. కె.గంగవరం మండలంలో తొలగించాల్సిన ఓటర్లకు పాత తేదీలను వేసి నోటీసులు అందించాలని ఉన్నతాధికారి బీఎల్ఓలను ఆదేశించినట్టు సమాచారం. అధికార పార్టీ నేత అందించిన జాబితాల ప్రకారం ఓట్లను తొలగించాలని ఒత్తిడి చేయడంతో బీఎల్ఓలు ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కూలి పనులకు వలస వెళ్లిన వారి ఓట్లు ఎలా తొలగిస్తారని కొ ంత మంది ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయని, ప్రతి నెలా రేషన్‌ను తీసుకుంటున్నా ఊర్లో ఉండటం లేదని కొందరు చెపుతున్న అవాస్తవాలను పరిగణించడమేమిటని నిలదీస్తున్నారు. బీసీ, ఎస్సీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు.
జాబితాలు అందించడం అవాస్తవం..
ఓటర్ల తొలగింపుపై కె.గంగవరం మండల తహశీల్దార్ ఎన్.రమేష్‌ను వివరణ కోరగా గ్రామాల్లో తాత్కాలికంగా వలస వెళ్లిన వారికి నిబంధనల మేరకు నోటీసులు అందిస్తున్నామన్నారు. గ్రామసభలను పెట్టి సమాచారం సేకరించిన అనంతరమే జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అధికార పార్టీ వారు జాబితాలను అందించిన మాట అవాస్తవమని, తాను బీఎల్ఓలకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని స్పష్టం చేశారు.