నేడు పుష్పయాగోత్సవం
నేటితో ముగియనున్న నృసింహుడి బ్రహ్మోత్సవాలు
ఖాద్రీ లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు.
బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన పుష్ప తాంబూలాలు సమర్పించి, వారిని వారి వారి లోకాలకు సాగనంపుతారు. తొలుత నవ కలశ ప్రతిష్ట, వాస్తు హోమాలు జరిపి, ఆలయ మహా సంప్రోక్షణ గావిస్తారు. శ్రీవారికి నిత్యకైంకర్యములు పూర్తిచేసి, తర్వాత విశేష పూల అలంకరణ, మంగళ హారతులు ఇచ్చి, పుష్పయాగోత్సవం ముగిస్తారు. ఉభయదారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు.