ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోల మోహరింపు
భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్ ఎయిర్‌బేస్ మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఈ బలగాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలను అక్కడ మోహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లను కూడా ఇప్పటికే హతమార్చారా.. లేదా అన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 8 గంటల తర్వాత పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడం లేదని ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలో ఉన్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు చెబుతున్నారు.
హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులను పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని డొమెస్టిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశామని, దాంతో టెక్నికల్ ఏరియా మొత్తం సురక్షితంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం పరిస్థితిని అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.